మంత్రి అయితే ఆస్తులు పెరిగినట్లేనా?

వామ్మో...ఈయన గారి ఆస్తులు చూస్తే కళ్లు తిరగాల్సిందే. కోట్ల రూపాయల నగదు, వజ్ర వైఢూర్యాలు, మరకత మాణిక్యాలు, భూములు, భవనాలు అన్నీ కలిపి ఈ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న వ్యక్తికి ఉన్న ఆస్తులు. ఈయన నామినేషన్ పత్రాల్లో ఆయనే తన ఆస్తుల విలువను స్వయంగా ప్రకటించుకున్నారు. ఆయన ఆస్తుల విలువ మొత్తం 730 కోట్ల రూపాయలు. ఈయన ప్రస్తుతం కర్ణాటకలో విద్యుత్తుశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయనపేరు డీకే శివకుమార్. కాంగ్రెస్ తరుపున కనకపుర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. నియోజకవర్గం పేరుకు తగ్గట్టుగానే ఈయన ఆస్తులండటం విశేషం.
ఆస్తుల విలువ 750 కోట్లు.....
కర్ణాటక ఎన్నికల్లో నామినేషన్లు దాఖలవుతున్నాయి. ఇందులో కనకపుర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డి.కె. శివకుమార్ కు 730 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించుకున్నారు. గత ఎన్నికల్లోనూ శివకుమార్ పోటీ చేసినప్పుడు ఆస్తుల విలువను ప్రకటించారు. అప్పుడు ఆయన ఆస్తుల విలువల 251 కోట్ల రూపాయలు. ఆయన కర్ణాటకలో మంత్రిగా పనిచేస్తున్నారు. 2013 నాటికి ఇప్పుడు ఎన్నికల సమయానికి ఆయన ఆస్తుల విలువ మూడు రెట్లు పెరగడం విశేషం.
బ్యాంకులో నగదు 95 కోట్లు.....
శివకుమార్ కు బ్యాంకులోనే 95 కోట్ల రూపాయల నగదు ఉన్నట్లు ఎన్నికల నామినేషన్ పత్రంలో పేర్కొనడం విశేషం. అంతేకాదు దాదాపు రెండు కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు, వజ్రాలు ఉన్నట్లు పేర్కొన్నారు. వీటితో పాటు స్థిర, చరాస్థుల విలువ 635 కోట్లుగా చూపడం గమనార్హం. శివకుమార్ తన కూతురు ఐశ్వర్య ఆస్తుల విలువ 100 కోట్లగా చూపారు. అయితే శివకుమార్ పై గతంలో ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిగాయి. ఆదాయపు పన్ను చెల్లించలేదన్న కారణంగా దాడులు జరిపి కొన్ని ఆస్తులను సీజ్ కూడా చేశారు. ఐదేళ్లలో మూడు రెట్లు ఈ మంత్రి ఆస్తులు పెరగడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
