ఇక కర్ణాటక కింగ్ కుమారస్వామి...

కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా జనతాదళ్(ఎస్) నేత కుమారస్వామి ప్రమాణస్వీకారం చేశారు. కర్ణాటక విధానసౌధ ఆవరణలో బుధవారం సాయంత్రం అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పార్టీల నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కుమారస్వామితో పాటు ఉప ముఖ్యమంత్రిగా కర్ణాటక పీసీసీ అధ్యక్షడు పరమేశ్వర కూడాప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ వాజూభాయ్ వీరిచేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున కాంగ్రెస్, జేడీఎస్ కార్యకర్తలు హాజరయ్యారు.
బీజేపీ వ్యతిరేకులను ఒకటి చేసిన వేదిక..
కుమారస్వామి ప్రమాణస్వీకార వేదికగా దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పార్టీల అగ్రనేతలందరూ ఒక్కతాటి పైకి చేరారు. కాంగ్రెస్ నుంచి ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అధ్యక్షులు రాహుల్ గాంధీ, మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మాయావతి(బీఎస్పీ), అఖిలేష్ యాదవ్(ఎస్పీ), సీతారాం ఏచూరీ(సీపీఎం), శరద్ పవార్(ఎన్సీపీ), తేజస్వీ యాదవ్(ఆర్జేడీ), హేమంత్ సొరేన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయాయరు. వీరంతా కరచాలనం చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం ప్రజలకు అభివాదం చేశారు. ముఖ్యంగా పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉత్సాహంగా కనిపించారు. వీరు సోనియా, రాహుల్ లతో ఎక్కువసేపు మాట్లాడారు.

