బెంగుళూరు ఎవరికి దెబ్బేస్తుంది?

కాంగ్రెస్, బీజేపీల నడుమ నువ్వానేనా అన్నట్లుగా సాగుతోన్న కర్ణాటక ఎన్నికల పట్ల పట్టణవాసులు అంతగా ఆసక్తి చూపినట్లు కనపడటం లేదు. ముఖ్యంగా బెంగళూరు నగరంలో పోలింగ్ తక్కువగా నమోదవుతోంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 56 శాతం పోలింగ్ నమోదైంది. కానీ, బెంగళూరులో మాత్రం కేవలం 40 శాతం మాత్రమే నమొదైంది. దీంతో బెంగళూరుపై ఆశలు పెట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ప్రజలనాడి బీజేపీకి కాస్త అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. దీంతో బెంగుళూరుపై ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. మరోవైపు బెంగళూరులో ఎక్కువ సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ కూడా మొదటి నుంచి నమ్మకంతో ఉంది. ఇప్పడు ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతుండటంతో బెంగళూరు దెబ్బ ఏ పార్టీకి తగలనుందో అని రెండు పార్టీలు బయపడుతున్నాయి.
లెక్కలేసుకుంటున్న పార్టీలు....
మరోవైపు పోలింగ్ సరళిపై మూడు ప్రధాన పార్టీల నాయకులు సమీక్షలు జరుపుతున్నారు. ప్రత్యేకంగా ప్రాంతాలవారీగా ఎక్కడ ఎంత శాతం ఓటింగ్ జరుగుతుందో పరిశీలించి ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుందో లెక్కలేసుకుంటున్నారు. బాంబే కర్ణాటక ప్రాంతంలో ఎక్కువ శాతం పోలింగ్ నమోదవుతోంది. అత్యధికంగా చామరాజనగర్ తో మధ్యాహ్నం 3 గంటల వరకే 65 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, మొత్తానికి పోలింగ్ శాతం తక్కువగానే నమోదవుతున్నందున ప్రభుత్వంపై వ్యతిరేకత ఫలితాలపై ఉండకపోవచ్చని కాంగ్రెస్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

