మంచి అందగాడు. స్ఫురద్రూపి... విలన్లను చితక బాది లక్షలాది మంది అభిమానుల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు పవన్ కల్యాణ్. నిజానికి అతి తక్కువ సిినిమాల్లో నటించినా ఆయనకు లక్షలాది మంది అభిమానులను సమకూర్చిపెట్టింది ఆయన హీరోయిజమే. ఇప్పటికీ పవన్ కల్యాణ్ అభిమానులు ఆయనంటే పడిచస్తారు. సినిమాల్లో పవన్ రేంజ్ అది. ఆయన సినిమా రిలీజ్ అంటే థియేటర్ల దగ్గర తొక్కిసలాట ఆయన క్రేజ్ కు అద్దం పడుతుంది.
రాజకీయాల్లో మాత్రం....
అయితే రాజకీయాల్లో మాత్రం పవన్ కల్యాణ్ పెద్దగా రాణించలేదనే చెప్పాలి. ఆయన ఎప్పుడూ ఒంటరిగా పోటీ చేసే సాహసం చేయలేదు. పవన్ కల్యాణ్ కు ఉన్న బలం ఆయనకున్న అభిమానులు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను బట్టి ఆయన కులం. రెండు కలిస్తే ఆయనకు విజయం పెద్దకష్టమేమీ కాదు. కానీ పవన్ కల్యాణ్ తొలి నుంచి ఇతరులపై ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారు. అది అభిమానులకు కూడా మింగుడు పడటం లేదు.
గత రెండు ఎన్నికల్లో....
2014లో పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. బీజేపీ, టీడీపీ కూటమికి ఆయన మద్దతు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ మద్దతు వల్లనే టీడీపీ విజయం సాధించిందని ఇప్పటికీ ఆయన అభిమానులు చెప్పుకుంటారు. 2019 ఎన్నికలకు వచ్చే సరికి కమ్యునిస్టులు, బీఎస్పీ వంటి పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. కానీ ఒక్క సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఈసారి కూడా....
పవన్ కల్యాణ్ ప్రస్తుతం బీజేపీతో పొత్తుతో ఉన్నారు. రానున్న కాలంలో టీడీపీతో జత కట్టే అవకాశాలను కొట్టి పారేయలేని పరిస్థితి. ఒంటరిగా పోటీ చేసే సాహసాన్ని పవన్ కల్యాణ్ ఎప్పుడూ చేయలేదు. అసలు పవన్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేేసేందుకు ఎప్పుడూ కృషి చేయలేదు. పార్టీ పెట్టి ఏడేళ్లవుతున్నా ఇంతవరకూ చేతి వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన నియోజకవర్గాల్లోనే నాయకత్వం ఉంది. టోటల్ గా పాలిటిక్స్ లో పవన్ కల్యాణ్ స్టామినా ఇది.