Thu Jan 29 2026 04:09:05 GMT+0000 (Coordinated Universal Time)
జనసేనాని బ్యాలన్స్ తప్పారా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ లో ఎన్నడూ లేని ఆగ్రహం కనిపించింది. వైసీపీ ట్రాప్ లో పడిపోయినట్లే అనిపిస్తుంది

జనసేన అధినేత పవన్ కల్యాణ్ లో ఎన్నడూ లేని ఆగ్రహం కనిపించింది. వైసీపీ ట్రాప్ లో పడిపోయినట్లే అనిపిస్తుంది. రెచ్చిపోయి ఇష్టమొచ్చినట్లు ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో కలకలం రేపాయి. ఆయన పార్టీలో నేత కాదు. ఒక పార్టీకి అధినేత. ఒక పార్టీని నడపాల్సిన లీడర్. ఆయనను అనుసరించే క్యాడర్ పనిచేస్తుంది. అలాంటి పవన్ కల్యాణ్ బ్యాలన్స్ తప్పి పోయారనిపిస్తుంది. అసభ్యకరమైన పదాలు ఆయన నోటి నుంచి వెలువడటంతో పార్టీనేతలే విస్తుపోవాల్సి వచ్చింది.
రెచ్చగొట్టి ఉండొచ్చు...
నిజమే.. వైసీపీ నేతలు రెచ్చగొట్టొచ్చు. వ్యక్తిగత దూషణలకు దిగొచ్చు. ఆ విమర్శలకు పార్టీ నేతల చేత సమాధానం చెప్పొచ్చు. వైసీపీ నేతలు వ్యక్తిగతంగా తిట్టినంత మాత్రాన ఆయనకున్న ఇమేజ్ ఏమాత్రం తగ్గుముఖం పట్టదు. కానీ పార్టీ అధినేత బ్యాలన్స్ తప్పి నోరు జారితే తర్వాత సమాధానం చెప్పుకునే వారు పార్టీలోనే ఉండరు. అనంతరం చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నా ఫలితం ఉండదు. వైసీపీ నేతలకు వార్నింగ్ ఇవ్వొచ్చు. వారి రెచ్చగొట్టే చర్యలను ఖండించొచ్చు.
పార్టీ అధినేతగా...
కానీ ఒక పార్టీ అధినేతగా సంయమనం పాటించాలి. మౌనంగా ఉంటే కొంత సానుభూతి వస్తుంది. అవతలి వాళ్లు రెచ్చిపోయారని, రెచ్చిపోతే ఎవరికి నష్టం అని పార్టీ లోనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చల్లోనూ పాల్గొనాలని, ఏదైనా అతిగా మాట్లాడితే వెంటనే చెప్పుతీసుకుని కొట్టాలని క్యాడర్ ను రెచ్చగొడితే ఏం ప్రయోజనం ఉంటుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. పవన్ ప్రసంగాన్ని చూస్తే తన సహనాన్ని కోల్పోయారని పిస్తుంది.
లీడర్ గా...
ఆయన లీడర్ గా ఉండాల్సిన నేత. ఒక పార్టీని నడిపించాల్సిన లీడర్. వచ్చే ఎన్నికలలో పోటీ చేసి నెగ్గి అసెంబ్లీకి రావాల్సిన నేత. అలాంటి నేత నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం దురదృష్టకరం. పార్టీ అధినేతలంటే సంయమనం ఉండాలి. అది వైసీపీ అధినేత జగన్ కావచ్చు. టీడీపీ అధినేత చంద్రబాబు కావచ్చు. కానీ మాట నోరు జారితే అది పార్టీని ప్రజల్లో పలుచన చేస్తుంది. ఈ విషయం పార్టీ నేతలలోనూ చర్చనీయాంశమైంది. రాజకీయంగా కూడా పవన్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.
Next Story

