Thu Mar 26 2026 11:00:21 GMT+0530 (India Standard Time)
ఢిల్లీ టూర్ సక్సెస్... క్లారిటీ వచ్చేసినట్లేనా?
ముందస్తు ప్లాన్ ప్రకారమే జగన్ ఢిల్లీ వెళ్లారు. ఈసారి జగన్ ఢిల్లీ టూర్ సక్సెస్ అయినట్లే కనిపిస్తుంది

అనుకోకుండా కాదులే కాని.. ముందస్తు ప్లాన్ ప్రకారమే జగన్ ఢిల్లీ వెళ్లారు. ఈసారి జగన్ ఢిల్లీ టూర్ సక్సెస్ అయినట్లే కనిపిస్తుంది. ఒక్కరోజులోనే కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలందరినీ జగన్ కలిశారు. వారి అపాయింట్ మెంట్ లు సులువుగా లభించాయి. కొద్దిసేపటి క్రితం రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన అనంతరం జగన్ ఢిల్లీ నుంచి బయలు దేరి వెళ్లారు. అనుకున్నట్లుగానే జగన్ ఢిల్లీ టూర్ జరిగిందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా....
ప్రతిసారీ ఢిల్లీ కి జగన్ వెళ్లాలంటే ఒక ప్రహసనంలా మారేది. అపాయింట్ మెంట్లు దొరకలేదని, బీజేపీ పెద్దలు జగన్ కు దూరమయ్యారన్న ప్రచారం జోరుగా సాగేది. జగన్ పట్ల కేంద్ర ప్రభుత్వం కూడా నారాజ్ గా ఉందని కూడా ఒక వర్గం మీడియా ప్రచారం చేసేది. కానీ జగన్ ఈసారి అటువంటి ప్రచారాలకు తావివ్వలేదు. తాను అనుకున్న వారిని కలిశారు. తాను చెప్పాలనుకున్న మాటలను చెప్పేసి వచ్చారు. రాష్ట్ర ప్రయోజానాలపై వినతి పత్రం సమర్పించారు.
మోదీతో గంటపాటు...
మోదీని కలవడానికి వెళితే సీబీఐ కేసులు, వివేకాహత్య కేసు నుంచి తన సన్నిహితులను తప్పించుకోవడానికేనని విపక్షాలు ఘాటుగా విమర్శించేవి, ప్రధానితో జరిగిన భేటీ వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేసేవి. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి జగన్ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్లారన్న ప్రచారమూ సాగేది. కానీ మోదీతో గంటకు పైగా సమావేశం కావడంతో అటువంటి నోళ్లకు జగన్ అడ్డుకట్ట వేయగలిగారు.
రాజకీయ అంశాలను...
రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే కాకుండా రాజకీయ పరమైన అంశాలను కూడా జగన్ ఢిల్లీ పెద్దలతో చర్చించినట్లు తెలిసింది. ముఖ్యంగా రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ప్రధాని మోదీ, అమిత్ షాతో జరిగిన భేటీలో జగన్ చర్చించినట్లు సమాచారం. రాష్ట్రపతి అభ్యర్థి ఎవరైనా తన మద్దతు ఉంటుందని చెప్పి వచ్చారని తెలిసింది. దీంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, పునరేకీకరణ వంటి అంశాలను కూడా జగన్ ప్రస్తావించారంటున్నారు. మొత్తం మీద ఈసారి జగన్ ఢిల్లీ టూర్ సక్సెస్ ఫుల్ గానే ముగిసిందని చెప్పాలి.
Next Story

