కుదుపు కుదుపేసిన జగన్...!

పశ్చిమ గోదావరి నుంచి తూర్పు గోదావరిలోకి వైఎస్ జగన్ పాదయాత్రగా అడుగుపెట్టిన తీరు రాష్ట్ర రాజకీయాలనే ఒక కుదుపు కుదిపింది. చారిత్రక రోడ్ కం రైలు వంతెనపై జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర ఒక సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాదు జాతీయ మీడియా మొత్తం ఈ సందర్భానికి అత్యంత ప్రాధాన్యత కల్పించడం విశేషం. జగన్ పాదయాత్ర వారధిపై నాలుగున్నర కిలోమీటర్ల పరిధిలో జనసముద్రంగా కనిపించిన డ్రోన్ కెమెరా దృశ్యాలు అటు జాతీయ మీడియా లోను ఇటు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. పాదయాత్ర సందర్భంగా వారధి వూగిసలాడిన సందర్భంపై ప్రజల్లో తీవ్ర చర్చ నడుస్తుంది. స్వర్గీయ వైఎస్ ఆర్ పాదయాత్రకు మించి జనం తరలిరావడం ఇసుకవేస్తే రాలనంతగా జగన్ రాజమండ్రి సభ సక్సెస్ కావడం తో వైసిపి శ్రేణుల్లో ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. వారధిపై జగన్ పాదయాత్ర అపూర్వమని టిడిపి శ్రేణులు సైతం ఆఫ్ ది రికార్డ్ లో చర్చించుకోవడం గమనార్హం.
పోటా పోటీగా టిడిపి, వైసిపి కార్యక్రమాలు ...
తరువాత రోజే పసుపు నీళ్ళతో జగన్ వెళ్ళిన ప్రాంతాన్ని అపవిత్రాన్ని పవిత్రం చేశామంటూ టిడిపి చేపట్టిన కార్యక్రమం వివాదాస్పదం కూడా అయ్యింది. ఆ వెంటనే వైసిపి శ్రేణులు జగన్ బ్రిడ్జి పై చేపట్టిన పాదయాత్రకు టిడిపి దిష్టి తగులుతుందంటూ కోటిపల్లి బస్ స్టాండ్ సెంటర్ లో దిష్టి తీయడం వారి మనసులు శుద్ధి చేసుకోవాలంటూ పోటా పోటీగా చేపట్టిన కార్యక్రమాలు చర్చనీయాంశం అయ్యాయి. వచ్చేవి ఎన్నికల రోజులు కావడంతో వైసిపి అధినేత వర్షాకాలంలో పెంచిన హీట్ ఇప్పట్లో చల్లారేలా మాత్రం లేదు. 19 అసెంబ్లీ నియోజకవర్గాలు 3 పార్లమెంట్ సీట్లు అలాగే పశ్చిమలో 15 అసెంబ్లీ 2 పార్లమెంట్ సీట్లపై జగన్ పాదయాత్ర ప్రభావం రోడ్ కం రైలు వంతెనపై జరిగిన యాత్ర ఎఫెక్ట్ గట్టిగానే పడతాయని వైసిపి భావిస్తుంది. ఇదిలావుంటే జగన్ యాత్రకు ధీటుగా టిడిపి ధర్మపోరాట సభ రాజమండ్రి వేదికగా చేపట్టాలని ఆ పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో అమరావతిలో ముఖ్యమంత్రి నిర్ణయించారు. దాంతో ఎన్నికల కు ముందే గోదావరి జిల్లాల సెంటర్ పాయింట్ రాజమండ్రి లో చారిత్రక సమరానికి జగన్ తెరలేపినట్లే.
