మీది తెనాలే...మాది తెనాలే...ఇంతకీ ఎవరిది...!

జగన్ పాదయాత్ర గుంటూరు జిల్లాలో జరగుతోంది. ఈరోజు తెనాలి నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. తెనాలి నియోజకవర్గం కాంగ్రెస్, టీడీపీలకు దాదాపు సమానంగా అవకాశాలిస్తూ వస్తుంది. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఇక్కడ జగన్ బోణీ కొట్టలేదు. తెనాలి నియోజకవర్గం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది నాదెండ్ల కుటుంబం. నాదెండ్ల కుటుంబాన్ని ఈ నియోజకవర్గం అక్కున చేర్చుకుంది. అలాగే టీడీపీ కూడా ఇక్కడ నాలుగుసార్లు విజయం సాధించింది.
నాదెండ్ల ఫ్యామిలీకి.....
1989లో నాదెండ్ల భాస్కరరావు తెనాలి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో వరుసగా నాదెండ్ల భాస్కరరావు తనయుడు నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. గత ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించడంతో ఈ నియోజకవర్గంలో పట్టుకోల్పోయింది. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తన సమీప వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ పై దాదాపు 19 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.
వైసీపీ పట్టు పెంచుకుంటుందా?
ఇప్పుడు తెనాలి నియోజకవర్గంలో జగన్ పర్యటన ఆసక్తిని రేపుతుంది. నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఆయన వైసీపీలో చేరతారన్న ప్రచారం చాలా జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో జగన్ పర్యటన ఉత్కంఠను రేపుతుంది. వైసీపీ నియోజకవర్గంలో తన పట్టును పెంచుకోగలుగుతుందా? అనే ప్రశ్నలు ఆ పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీపై ఉన్న అసంతృప్తి తమకు అనుకూలమవుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు.
130వ రోజు యాత్ర షెడ్యూల్.....
జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర 130వ రోజుకు చేరుకుంది. శనివారం ఉదయం శేకూరు గ్రామ శివారు శిబిరం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి సంగం జాగర్లమూడి మీదుగా అంగల కుదురు చేరుకుంటారు. అంగలకుదురులో భోజన విరామానికి ఆగుతారు. ఆ తర్వాత సుల్తానాబాద్ మీదుగా తెనాలికి చేరుకుంటారు. తెనాలి పురవేదిక సెంటర్లో బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. రాత్రికి జగన్ తెనాలిలోనే బస చేస్తారు.
