తూర్పున మళ్లీ ఫ్యాన్ తిరుగుతుందా?

గుంటూరు తూర్పు నియోజకవర్గం వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టుంది. 2009లోనూ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయితే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ అడ్రస్ ఇక్కడ గల్లంతయింది. కాంగ్రెస్ పట్టున్న ప్రాంతాన్ని జగన్ పార్టీ ఆక్రమించేసింది. గుంటూరులోని తూర్పు నియోజకవర్గం వైసీపీకి గట్టి ఓటు బ్యాంకు ఉందనే చెప్పాలి. కాంగ్రెస్ ఓటు బ్యాంకునంతటినీ వైసీపీ సొంతం చేసుకోవడంతో ఇక తిరుగులేకుండా పోయింది. ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ గుంటూరు తూర్పు నియజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు.
వైసీపీకి పట్టున్న...
గుంటూరు తూర్పు నియోజకవర్గం ముస్లిం ఓటర్ల ప్రాబల్యం ఎక్కువ. అన్ని వర్గాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ముస్లిం అభ్యర్థులనే ఇక్కడ ప్రధాన పార్టీలు పోటీకి నిలబెడతాయి. అలాగే బ్రాహ్మణ సామాజిక వర్గ ఓటర్లూ అధిక సంఖ్యలో ఉన్నారు. 2009 ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా షేక్ మస్తాన్ వలి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి షేక్ షౌకత్ పై దాదాపు 9 వేల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఇక 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీచేసిన మహ్మద్ ముస్తాఫా, తెలుగుదేశం అభ్యర్థి మద్దాలి గిరిధరరావుపై మూడువేల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.
మంచి స్పందన వస్తుండటంతో....
గుంటూరు పట్టణంలో జరుగుతున్న పాదయాత్రకు మంచి స్పందనే లభిస్తుంది. ప్రజాసంకల్ప పాదయాత్రకు దారిపొడవునా ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. జగన్ ను స్వయంగా పలకరించాలని ఉత్సాహపడుతున్నారు. తమ సమస్యలన చెప్పుకుని ఊరట చెందుతున్నారు. సమస్యలన్నింటినీ సావధానంగా వింటున్న జగన్ దేవుడి దయవల్ల వైసీపీ అధికారంలోకి వస్తే పరిష్కరిస్తానని అక్కడికక్కడే హామీలు ఇస్తున్నారు. టీడీపీ నేతలు కూడా జగన్ పాదయాత్రకు గుంటూరు పట్టణంలో వచ్చిన స్పందనతో కొంత కంగారు పడుతున్నారని ఆ పార్టీ నేతలే చెబుతుండటం విశేషం.
129వ రోజుకు చేరిన పాదయాత్ర.....
వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర 129వ రోజుకు చేరుకుంది. గురువారం ఉదయం ఆయన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో బస చేసిన ప్రాంతం నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి వడ్లమూడి మీదుగా శాలపూడి క్రాస్ రోడ్స్్, గరువపాలెం, శేకు క్రాస్ రోడ్స్ వరకూ యాత్రను చేస్తారు. గుంటూరు జిల్లాలో జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రకు విశేష స్పందన లభిస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రజలు జగన్ ను ఆదరించారని, వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనన్న ధీమా వారిలో వ్యక్తమవుతోంది.
