Fri Aug 12 2022 02:37:42 GMT+0000 (Coordinated Universal Time)
దేవుడు రాసిన స్క్రిప్ట్ ఆర్కే మారుస్తున్నట్లుందే?

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన కొత్త పలుకులో ఎప్పుడూ జగన్ పై విషం కక్కుతూనే ఉంటాడు. వారం వారం అక్కసు, కసి మరింత పెరుగుతుందే తప్ప మరేమీ కన్పించదు. ఆర్కే బాధంతా ముఖ్యమంత్రి జగన్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను కలిసినందుకేనని పిస్తుంది. చీఫ్ జస్టిస్ రాష్ట్రానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో జగన్ కలిశారు. అది సంప్రదాయం. మర్యాద కూడా. కానీ ఆర్థిక నేరస్థుడు జగన్ ఒక చీఫ్ జస్టిస్ ను కలవడం మహాపరాధంగా రాధాకృష్ణ తన కొత్త పలుకులో చెప్పుకొచ్చాడు.
చీఫ్ జస్టిస్ ను కలవడం....
చీఫ్ జస్టిస్ ను కలిసి మన్నించమని వేడుకున్నారట. దీంతో జగన్ పై ఉన్న కేసులన్నీ మాఫీ అయిపోతాయేమోనని ఆర్కే తెగ కంగారుపడిపోతున్నారు. అంటే ఆయన రాతలు న్యాయవ్యవస్థ పై నమ్మకం లేవని చెప్పకనే చెబుతున్నాయి. సీజేఐ పై గతంలో జగన్ ఫిర్యాదు చేసినందున ఆయనను కలవడానికి జగన్ కు ఎంతమాత్రం అర్హత లేదన్నది ఆర్కే వాదన. ఇది ఎంతమాత్రం సమర్థనీయం కాదు. జగన్ ఒక ముఖ్యమంత్రిగా చీఫ్ జస్టిస్ ను కలిసినంత మాత్రాన ఏదో జరిగిపోయినట్లు ఊహించుకుని జగన్ కు అనుకూల తీర్పులు వస్తాయోమోనన్న బాధ ఆయన రాతల్లో కన్పించింది. తీర్పు రాకముందే జగన్ ను ఆర్థిక నేరగాడుగా కన్ఫర్మ్ చేసేశారు.
వివేకా హత్య కేసులో....
ఇక వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో సీీబీఐ దర్యాప్తు కంటే ఆర్కే తన పరిశోధనను తెలిపారు. ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ఇక వైఎస్ షర్మిల సీబీఐ అధికారుల ఎదుట సాక్ష్యం చెప్పేందుకు రెడీ అయిపోయారట. షర్మిల చెప్పే సాక్ష్యం ఏంటంటే వైఎస్ వివేకానందరెడ్డి జీవించి ఉన్నప్పుడు మనమిద్దరంలో ఒకరు కడప ఎంపీగా పోటీ చేయాలని చెప్పారట. ఆ విషయం షర్మిల సీబీఐ అధికారులకు చెబితే ప్రకంపనలు రేగుతాయట. హత్య విషయంలో ఈ సాక్ష్యం పనికొస్తుందా? అన్నది ఆర్కేయే చెప్పాల్సి ఉంటుంది. వైఎస్ వివేకా కూతురు సునీత ఇప్పటికే తన అనుమానాలను సీబీఐ అధికారుల ఎదుట ఉంచారు. ఆధారాల కోసం వారు ప్రయత్నిస్తుండవచ్చు. అంత మాత్రాన ఒక ఎంపీని ఈ హత్య కేసులో నిందితుడిగా ఖరారు చేయడం ఎంతవరకూ సబబన్న ప్రశ్నలు వస్తున్నాయి.
షర్మిలపై ఆంక్షలట....
మరోవైపు వైఎస్ షర్మిలను కలవకుండా ముఖ్యమంత్రి జగన్ కట్టడి చేస్తున్నారని ఆర్కే మరోకధను అల్లినట్లే కన్పిస్తుంది. తెలంగాణలో షర్మిలను బలహీనపర్చడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని చెప్పడానికి ఆర్కే ప్రయత్నించారు. అసలు షర్మిల పార్టీ తెలంగాణలో బలంగా ఉందా? లేదా? అన్న విషయం తెలీదా? ఇక షర్మిలను కలవకుడం కట్టడి చేసే పనైతే ఆమె పాదయాత్రలో జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొని ఎందుకు సంఘీభావం తెలిపారన్న ప్రశ్నకు ఆర్కేయే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. విశాఖలో వైఎస్ విగ్రహావిష్కరణకు షర్మిల వెళ్లాలా? వద్దా? అని తర్జన భర్జన పడుతున్నారట. నిజంగానే జగన్ షర్మిల వద్దకు ఎవరూ వెళ్లవద్దని పార్టీ నేతలను ఆదేశిస్తే ఆమెను ఆహ్వానించే ధైర్యం ఎవరికుంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ సాహసం చేసే వైసీపీ నేతలు ఎవరు?
చంద్రబాబు డేరింగ్.. డాషింగ్....
2019 లో దేవుడు రాసిన స్క్రిప్ట్ 2022 లో మారిపోతుందట. అంటే ఆర్కే ఐడియా ప్రకారం ఈ ఏడాది జగన్ జైలుకెళ్లడం ఖాయమని చెప్పకనే చెప్పినట్లయింది. దేవుడు రాసిన గొప్ప స్క్రిప్ట్ ను తాను మార్చి కొత్త పలుకులో వండి వార్చినట్లే కనపడుతుంది. అందితే కాళ్లు, అందకుంటే చేతులు పట్టుకునే మనస్తత్వం జగన్ ది. మరి చంద్రబాబుది ఏంటో? చంద్రబాబుకున్న ధైర్యం, ఆయన చేసే సాహసాలు జగన్ చేయలేరన్నదే ఆర్కే పరోక్షంగా చెప్పారన్న మాట. దేవుడు స్క్రిప్ట్ రాస్తాడో లేదో తెలియదు కాని పార్టీల నేతల ఫేట్ ను నిర్ణయించేది అంతిమంగా ప్రజలే.
Next Story