Heat Waves : దంచి కొడుతున్న ఎండలు... వర్షాల తర్వాత తీవ్రమైన ఉష్ణోగ్రతలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువయింది. ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువయింది. ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. నాలుగు రోజుల నుంచి వర్షాలు పడటంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్ నెలలోనే 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఏప్రిల్ లోనే ఇలా ఉంటే ఏమే నెలలో ఇక ఎండలు ఇంకెంత దంచి కొడతాయోనన్న భయం అందరిలోనూ నెలకొంది. ఈ నెల చివరి వారంలో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చనేసింది. వీలయినంత వరకూ బయటకు రాకుండా ఇంటిపట్టునే గడపాలని సూచిస్తున్నారు. కేవలం ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే బయటకు రావాలని సూచిస్తున్నారు.
తెలంగాణలో ఈరోజు కూడా భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, సిరిసిల్ల మంచిర్యాల, జగత్యాల, నిజామాబాద్, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో నేడు నలభై ఐదు డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలంగాణలోని మిగిలిన జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రాత్రి పూట కూడా వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. వీలయినంత వరకూ బయటకు రాకుండా ఇంటిపట్టునే ఉండాలని కోరింది. వడదెబ్బ తగిలితే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరింది. ఎక్కువగా నీరు తాగుతూ డీహైడ్రేషన్ నుంచి శరీరాన్ని కాపాడుకోవాలని కోరింది.

