Mon Dec 09 2024 03:39:30 GMT+0000 (Coordinated Universal Time)
ఇది నా పునర్జన్మ.. గత జన్మ తల్లిదండ్రుల గురించి ఆరా తీసిన చిన్నారి
నాలుగేళ్ల బాలిక తన గత జన్మ వివరాలను పూస గుచ్చినట్లు చెప్తోంది. ఆ పాప చెప్పిన విషయాలపై ఆరా తీస్తే..
మనిషి మరణించాక.. మళ్లీ పునర్జన్మ ఉంటుందా ? ఉంటే గత జన్మ తాలూకా విషయాలు వారికి గుర్తుంటాయా ? అంటే.. ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. అసలు పునర్జన్మలే లేవని కొట్టిపారేసే వారూ ఉన్నారు. ఉన్నాయని నమ్మేవారూ ఉన్నారు. వీటికి సంబంధించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ పునర్జన్మకు సంబంధించే.. రాజస్థాన్ లో ఓ ఘటన వెలుగుచూసింది. నాలుగేళ్ల బాలిక తన గత జన్మ వివరాలను పూస గుచ్చినట్లు చెప్తోంది. ఆ పాప చెప్పిన విషయాలపై ఆరా తీస్తే.. అదే నిజమని తేలింది. ఈ ఘటన.. సల్మాన్ఖాన్, షారూఖ్ ఖాన్ నటించిన 'కరణ్ అర్జున్' సినిమాను గుర్తు చేస్తోంది. తెలుగులోనూ ఇటీవల విడుదలైన శ్యామ్ సింగరాయ్ కూడా పునర్జన్మ గురించే.
వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ లోని పారావాల్ గ్రామానికి చెందిన రతన్ సింగ్ చుందావత్ కు ఐదుగురు కుమార్తెలు. వారిలో నాలుగేళ్ల కింజల్ ఒకరు. ఏడాది క్రితం ఆ బాలిక నా సోదరుడు ఎక్కడ అని తండ్రి రతన్ సింగ్ ను అడిగింది. ఆమె మాటలను రతన్ సింగ్ పట్టించుకోలేదు. అయినప్పటికీ బాలిక ఆ విషయాన్ని అడగడం మానలేదు. గత జన్మ స్మృతుల గురించి చెప్తుండటంతో.. ఏదో మానసికంగా బాధపడుతుందనుకుని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అన్ని పరీక్షలు చేయగా.. బాలికకు ఎలాంటి మానసిక సమస్య లేదని తేలింది. గత జన్మలో తన తల్లిదండ్రులు, సోదరుడి గురించి చెప్పడమే కాకుండా.. వారిపేర్లను కూడా తెలిపింది.
Also Read : అందరికీ ధైర్యం చెప్పి.. తానే బలవన్మరణం పొంది?
గతజన్మలో తన పేరు ఉష అని, 2013లో ప్రమాదవశాత్తు మంటల్లో కాలిపోయి మరణించానని తెలిపింది. ఆమె చెప్తున్న వివరాలను బట్టి పిప్లాంత్రి అనే గ్రామానికి వెళ్లారు. ప్రస్తుతం బాలిక, తల్లిదండ్రులు ఉంటున్న ఊరికి ఆ గ్రామం 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. పిప్లాంత్రికి వెళ్లాక.. గత జన్మ తల్లిదండ్రులను బాలిక గుర్తించింది. ఆ ఇంటితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. తన ఇద్దరు పిల్లల యోగ, క్షేమాల గురించి అడిగి తెలుసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలడంతో తాను చనిపోయానంటూ ఆ రోజు జరిగిన ఘటనను పూర్తిగా వివరించడంతో.. ఆ బాలిక చెప్పేది పూర్తిగా నిజమని ఇరు కుటుంబాలు నమ్మాయి. బాలిక ద్వారా రెండు కుటుంబాల మధ్య విడదీయలేని బంధం ఏర్పడింది. ప్రస్తుతం తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల వద్దే ఉంటున్న బాలిక.. గత జన్మలోని తల్లిదండ్రులతో తరచూ ఫోన్లో మాట్లాడుతూ.. తనకన్నా వయసులో పదేళ్ల పెద్దవారైన తన పిల్లల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటోంది.
News Summary - in udaipur four years old girl shares shocking things about her last birth
Next Story