Fri Dec 06 2024 16:46:19 GMT+0000 (Coordinated Universal Time)
పాపం.. వీళ్ల గురించి వాళ్లకు తెలియదులా ఉంది
విశాఖ స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా తొలినాళ్లలో అన్ని పార్టీలు గట్టిగానే మద్దతిచ్చాయి. తర్వాత వదిలేశాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతల గురించి.. పార్టీల గురించి పాపం కార్మికులకు, రైతులకు పెద్దగా అవగాహన ఉన్నట్లు లేదు. తమకు అవసరం ఉన్న సమయంలోనే వారు అండగా నిలుస్తారు. లేదంటే సైడయి వెళ్లిపోతారు. అమరావతి రాజధాని ఉద్యమాన్ని కూడా అన్ని పార్టీలూ అలా పైకి లేపి, చివరకు వారి మానాన వారిని వదిలేశాయి. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల పరిస్థితి కూడా అంతే. వచ్చే నెల 12వ తేదీ నాటికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా నిరసన చేపట్టి ఏడాది కావస్తుంది.
వైసీపీ, టీడీపీ.....
విశాఖ స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా తొలినాళ్లలో అన్ని పార్టీలు గట్టిగానే మద్దతిచ్చాయి. వైసీపీ కార్మికులకు మద్దతుగా విశాఖపట్నంలో పాదయాత్ర చేసింది. ఇక టీడీపీ అయితే ఏకంగా ఆమరణ దీక్షకు దిగింది. ఆ పార్టీ నేత పల్లా శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించవద్దంటూ ఆ పార్టీ నేత పల్లా శ్రీనివాసరావు దీక్షకు దిగితే స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లి పరామర్శించి వచ్చారు.
జనసేన హడావిడి....
ఇక జనసేన పార్టీ గురించి చెప్పాల్సిన పనిలేదు. పవన్ కల్యాణ్ కార్మికులకు అండగా విశాఖ వెళ్లి దీక్షలో పాల్గొన్నారు. అంతేకాదు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న వ్యవహారాన్ని నిరసించారు. వెంటనే దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ మంగళగిరి పార్టీ కార్యాయంలో ఎనిమిది గంటల పాటు ఆయన దీక్షకు దిగి స్టీల్ ప్లాంట్ కార్మికులకు సంఘీభావం తెలిపారు.
కనీస ప్రయత్నం....
అయితే ఇదంతా కేవలం రాజకీయాల కోసమే మూడు పార్టీలూ చేస్తున్నాయి. అధికార వైసీపీ కేంద్ర ప్రభుత్వంతో దీనిపై ఎటువంటి చర్చలు జరపలేదు. జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను కలిసినా ఈ విషయాన్ని ప్రస్తావించలేదంటారు. ఇక బీజేపీలో మిత్రపక్షంగా కొనసాగుతున్న జనసేన కూడా బీజేపీ పెద్దలను కలిసే ప్రయత్నం చేయలేదు. ఇక తెలుగుదేశం పార్టీ కూడా ఇందుకు మినహాయింపు కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ప్రశ్నించే సాహసం చేయలేకపోతుంది. పాపం కార్మికులే ఏడాదిగా ప్లాంట్ ను రక్షించుకోవడం కోసం పోరాడుతున్నారు. ఆరాటపడుతున్నారు. ఈ రాజకీయ పార్టీలు మాత్రం వారిని ఓటు బ్యాంకులుగానే చూస్తున్నాయన్నది వాస్తవం. వచ్చే నెల 23న విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. ఆ బంద్ లో మాత్రం అన్ని పార్టీలు పాల్గొని మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తాయి.
Next Story