Fri Aug 12 2022 02:22:17 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీకి అక్కడ అభ్యర్థే లేడట...?

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి తిరుగులేకుండా ఉంది. మొన్నటి ఎన్నికల్లో 151 శాసనసభ స్థానాలను, 22 పార్లమెంటు స్థానాలను గెలుచుకుని ఊపు మీద ఉంది. వచ్చే ఎన్నికల్లో అంత కాకపోయినా విజయానికి తగినన్ని సీట్లు వచ్చే అవకాశాలు వైసీపీకి ఉన్నాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే మరోసారి వైసీపీ విజయం ఖాయమని రాజీకీయ పండితులు కూడా అంటున్నారు. ఎన్ని పొత్తులతో కూటమి ఏర్పడినా మరోసారి జగన్ కు గెలుపు ఖాయమంటున్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది కాబట్టి పరిస్థితులు మారతాయేమో చెప్పలేం.
బలమైన నేతలున్నా....
అయితే 175 నియోజకర్గాల్లో వైసీపీకి బలమైన నేతలున్నారు. క్యాడర్ ఉంది. అలాగే 25 పార్లమెంటు స్థానాల్లోనూ వైసీపీకి ఇబ్బంది లేదు. కానీ ఒక చోట మాత్రం అభ్యర్థిని కొత్తగా వెతుక్కోవాల్సిన పరిస్థితి. అదే విజయవాడ పార్లమెంటు స్థానం. విజయవాడ పార్లమెంటు స్థానం గత ఎన్నికల్లోనూ వైసీపీకి దక్కలేదు. ఇది కమ్మ సామాజికవర్గానికి రిజర్వ్ అయిన సీటుగానే చూడాలి. విజయవాడ పార్లమెంటు ఆవిర్భావం నాటి నుంచి ఎక్కువ మంది ఆ సామాజికవర్గానికి చెందిన వారే ఎంపీగా ఎన్నికయ్యారు.
గత ఎన్నికల్లో....
జగన్ కూడా గత ఎన్నికల్లో అదే ప్రయోగం చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ ను ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించారు. కానీ ఆయన టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని చేతిలో ఓటమి పాలయ్యారు.పార్లమెంటు పరిధిలోని అధిక శాతం నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచినా ఎంపీ అభ్యర్థి మాత్రం గెలవలేదు. సరే.. ఎన్నికల తర్వాత వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా ఆయన జాడ మాత్రం లేదు.
ఈసారి మారుస్తారా?
పార్టీలో యాక్టివ్ గా లేరు. తన వ్యాపారాలకే పరిమితమయ్యారు. పొట్లూరి వరప్రసాద్ పేరు వైసీపీ పేజీ నుంచి డిలీట్ చేసేశారు. ఇప్పుడు కొత్తవారిని ఎంపిక చేయాల్సి ఉంది. అయితే సంప్రదాయానికి భిన్నంగా ఈసారి కమ్మేతర అభ్యర్థిని జగన్ ఎంపిక చేస్తారని తెలిసింది. బీసీ సామాజికవర్గానికి చెందిన వారికి టిక్కెట్ ఇచ్చే అవకాశముందంటున్నారు. కమ్మ సామాజికవర్గంలో వైసీపీకి సరైన అభ్యర్థి దొరకకపోవడమే దీనికి కారణమని చెబుతున్నారు. మొత్తం మీద వైసీపీకి విజయవాడ ఎంపీ అభ్యర్థి ఎవరన్న చర్చ పార్టీలో ఇప్పటి నుంచే మొదలయింది.
Next Story