పంతం నీదా..? నాదా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అసలైన రసవత్తర పోరుకి రంగం సిద్ధమైంది. ఆదివారంతో లీగ్ మ్యాచ్ లు మిగియగా, మంగళవారం నుంచి ప్లేఆఫ్ మ్యాచ్ లు ప్రారంభమవుతున్నాయి. పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్, రెండో స్థానంలో ఉన్న ఛైన్నై సూపర్ కింగ్స్ నడుమ ముంబాయిలోని వాంఖడే స్టేడియం ఈ మ్యాచ్ కి వేదికైంది. అయితే రెండు దక్షిణాది రాష్ట్రాల మధ్య జరుగుతున్న ఈ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో మరికాసేపట్లో తేలనుంది.
ప్రతీకారం తీర్చుకునేనా..?
ఈ ఐపీఎల్ సీజన్ మొదలైన నాటి నుంచీ హైదరాబాద్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోయింది. ఆరు వరుస విజయాలతో సన్ రైజర్స్ జోరుకు చెన్నై అడ్డుకట్ట వేసింది. చెన్నైతో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ హైదరాబాద్ ఓటమి చవిచూసింది. మంచి బౌలింగ్ లైనప్ ఉన్న విలియమ్సన్ సేన పటిష్ఠ బ్యాటింగ్ సామర్థ్యం ఉన్న కింగ్స్ ముందు నిలువలేకపోయింది. అయితే ప్లేఆఫ్ లో ధోనీసేనపై విజయం సాధించి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది హైదరాబాద్ జట్టు. అయితే సన్ రైజర్స్ ఆటతీరుపై పూర్తి అంచనాలతో బరిలోకి దిగుతున్న చైన్నై మరోసారి ఓడించి సెకండ్ క్వాలిఫయర్ అవసరం లేకుండానే ఫైనల్ బెర్త్ సంపాదించాలని ఉవ్విళ్లూరుతోంది. పైగా కీలకమైన మ్యాచ్ ల్లో విజయాలు సాధించడం చెన్నైకి వెన్నెతో పెట్టిన విద్య.
ఎవరి బలాబలాలేంటీ...?
అయితే బౌలింగ్ లో బలంగా ఉన్న హైదరాబద్ ప్రత్యర్థి జట్టుకు తక్కువ లక్ష్యాన్ని ఇచ్చినా కూడా నిలబెట్టుకోగలుగుతుంది. అయితే గత నాలుగైదు మ్యాచ్ లుగా హైదరాబాద్ బౌలింగ్ అంతగా మెరుగ్గా ఏమీ లేదు. ఇక బ్యాటింగ్ విషయంలో కూడా విలియమ్సన్ పై ఎక్కువగా ఆధారపడుతుంది. మనీష్ పాండే, శిఖర్ ధావన్, యూసుఫ్ పఠాన్ కూడా బ్యాట్ తో జూలువిదిలిస్తేనే విజయవకాశాలు మెరుగవుతాయి. అయితే, గత మూడు మ్యాచ్ ల్లోనూ పరాజయాలతో ఉన్న హైదరాబాద్ ఏమాత్రం నైరశ్యం లేకుండా ఉత్సాహంగా ఆడాల్సి ఉంది. ఇక, వాట్సన్, ధోనీ, రైనా, రాయుడు, డిప్లెసిస్, జడేజా, బ్రావోలతో బలమైన బ్యాటింగ్ లైనప్ చైన్నై సొంతం. ఇక బౌలింగ్ లో కొంత మెరుగైతే విజయం సొంతం చేసుకోవడం ఏమంత కష్టం కాదు. పైగా లీగ్ దశలో రెండు మ్యాచ్ ల్లోనూ హైదరాబాద్ ను ఓడించిన అనుభవం ధోనిసేన సొంతం.

