హైకోర్టు సీరియస్...!

హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ ను థిక్కరిస్తూ పేదల ఇళ్లను కూల్చివేసిన కేసులో గన్నవరం తహసిల్దార్ మాధురికి హైకోర్టు శిక్ష విధించింది. హెచ్.సి.ఎల్ సంస్థ కోసం బలవంతంగా ఇళ్లు కూల్చి భూసేకరణ చేసిన గన్నవరం తాహసిల్దార్ పై హైకోర్టు సీరియస్ అయింది. తహసిల్దార్ కు ఒక నెల కఠిన కారాగారశిక్ష, , 55 వేల రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. గన్నవరం మండలం కేసరపల్లి శివారు దుర్గపురంలో హెచ్.సి.ఎల్ సంస్థకు 33 ఎకరాల స్థలం అవసరమయింది. ఈ మేరకు గన్నవరం తహసిల్దార్ మాధురి ప్రభుత్వ స్థలం కోసం దుర్గాపురంలో అవసరమైన స్థలాన్ని గుర్తించారు.
ప్రయివేటు స్థలంలోనూ.....
అక్కడ నివసిస్తున్న పేదలను ఖాళీ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ స్థలంలోనే కాకుండా ప్రయివేటు స్థలంలో ఉన్న వారిని కూడా ఖాళీ చేయాలని గన్నవరం తహసిల్దార్ ఆదేశించారు. దీంతో ప్రయివేటు స్థలం యజమానులు గత ఏడాది హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు స్టే విధించింది. అయినా కోర్టు ఆదేశాలు థిక్కరించడంతో పాటు ప్రయివేటు స్థలంలో ఉన్న ఇళ్లను కూడా కూల్చి వేయడంతో కోర్టు థిక్కారం కింద బాధితులు మరోసారి హైకోర్టుకు వెళ్లారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు తాహసిల్దార్ మాధురికి నెల రోజుల శిక్షతో పాటు రూ.55 వేల జరిమానా విధించింది.

