Mon Dec 15 2025 08:27:47 GMT+0000 (Coordinated Universal Time)
Rain Alert : నేడు కూడా భారీ వర్షాలు... ఎల్లో అలెర్ట్ జారీ
రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అధికంగా పడుతున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అధికంగా పడుతున్నాయి. నేడు కూడా భారీ వర్షాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. పగటి పూట ఎండలు, సాయంత్రానికి వర్షం దంచికొడుతుండటంతో ప్రజలతో పాటు రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో క్యుమలో నింబస్ మేఘాల వల్ల తెలంగాణలో వర్షాలు పడుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉన్నపళంగా వర్షాలు పడుతుండటంతో ప్రజలు కూడా అయోమయంలో పడుతున్నారు.
రైతులకు ఇబ్బంది...
పంట చేతికి వచ్చే సమాయనికి అకాల వర్షాలు రైతులను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణలో వరి పంట దెబ్బతినగా, ఆంధ్రప్రదేశ్ లో మామిడి, నిమ్మ, బత్తాయి, అరటి వంటి తోటలు దెబ్బతిన్నాయి. తమకు పంట నష్ట పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వాలు తమను ఆదుకోవాలనికోరుతున్నారు. పాడైపోయిన పంటలను చూసి రైతులు ఆవేదన చెందుతున్నారు. హైదరాబాద్ లో కూడా కుండ పోత వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రహదారులు వర్షపు నీటితో నిండిపోయాయి.
ఈదురుగాలులతో కూడిన...
తెలంగాణలోనూ ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుండటంతో చెట్లు కూడా కూలిపోతున్నాయి. ఈరోజు జోగులాంబ గద్వాల్, నారాయణ్ పేట్, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, మెదక్, సంగారెడ్డి,మెదక్, మల్కాజ్ గిరి, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీవర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. దీంతో పాటు వడగళ్ల వానలు కూడా కొన్ని చోట్ల పడే అవకాశముందని తెలిపింది.
Next Story

