ఆ టీడీపీ సీనియర్ మళ్లీ పోటీ... పుకార్లకు చెక్

గోరంట్ల బుచ్చయ్య చౌదరి. టీడీపీలో సీనియర్ మోస్ట్ నేతగా ఆయన రికార్డు సృష్టించారు. ఏవిషయాన్నైనా సూటిగా.. స్పష్టంగా చెప్పడంలోనూ విపక్షంపై విమర్శలు చేయడంలోనూ ఆయనకు ఆయనే సాటి! ఇప్పటి వరకు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గోరంట్ల ఒకే ఒక్కసారి మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిత్య అసంతృప్తి వాదిగా ఇటీవల పేరు తెచ్చుకున్న ఆయన చంద్రబాబు కేబినెట్లో బెర్త్‌ను ఆశించారు. వాస్తవానికి 2014లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన సమయంలోనే ఆయన ప్రభుత్వంలో చేరాలని అనుకున్నారు. కానీ, అనూహ్య రీతిలో కుల సమీకరణలు అడ్డు పడ్డాయి. ఇక, 2017 ఏప్రిల్‌లో జరిపిన విస్తరణలో మరోసారి ఆశలు పెట్టుకున్నారు. అయితే, అప్పుడు కూడా పనిజరగలేదు. దీంతో తీవ్రస్థాయిలో అలక బూనిన ఆయన ఇప్పటికీ ఒకింత కోపంగానే ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే నిన్న మొన్నటి వరకు ఇక, వచ్చే ఎన్నికల్లో బుచ్చయ్య చౌదరి ఎన్నికల నుంచి తప్పుకొంటున్నారనే వ్యాఖ్యలు జోరుగా వినిపించాయి. వయస్సు ప్రభావంతో కూడా చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఆయన్ను తప్పిస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే బుచ్చయ్య వీటికి చెక్ పెట్టేశారు. ఇక సిటీ నియోజకవర్గానికి ఆయన మారతారన్న వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చారు. తాను రూరల్ నుంచే బరిలో ఉంటానని చెప్పేశారు. 1983 నుంచి 2004 ఎన్నికల వరకు ఓటమి లేకుండా సిటీ నుంచి అప్రతిహతంగా విజయాలు సాధిస్తూ వచ్చిన ఆయన 2004లో తొలిసారిగా ఓడిపోయారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లోనూ స్వల్ప ఓట్ల తేడాతో ఓడారు. ఇక గత ఎన్నికల్లో సిటీ సీటును పొత్తు నేపథ్యంలో బీజేపీకి ఇవ్వడంతో ఆయన రూరల్ నుంచి పోటీ చేసి ఘనవిజయం సాధించారు. ఇక వచ్చే ఎన్నికల్లోనూ ఆయన రూరల్ నుంచే బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించారు.
ఇక, ఆయన రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే.. టీడీపీ అంటే అత్యంత అభిమానం, చంద్రబాబు, ఎన్టీఆర్ అంటే విధేయత మెండుగా ఉన్న నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. పటిష్టమైన సమాచారంతో ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టగల నేతగా కూడా గుర్తింపు పొందారు. అయితే, పార్టీలో ఎలాంటి గుర్తింపు లేకుండా పోయిందని, తన తర్వాత వచ్చిన వారంతా దూసుకు పోతున్నారని, పార్టీ అధినేత చంద్రబాబు సైతం వారికే అవకాశాలు ఇస్తున్నారని పదే పదే తెరచాటున విమర్శించిన బుచ్చయ్య చౌదరి, కొన్నాళ్లుగా మౌనంగానే ఉండిపోయారు. అయితే, ఇప్పుడు తాజాగా మరోసారి తెరమీదికి వచ్చారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశానని, అభివృద్ధిలో మూడో స్థానంలో నిలిచిన ఈ నియోజకవర్గం నుంచే తిరిగి పోటీ చేస్తానని గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు.
కడియంలో తాజాగా నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో గోరంట్ల మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పరిచానన్నారు. కోట్లాది రూపాయల నిధులతో సీసీరోడ్లు, డ్రైన్లు, చంద్రన్నబాట రోడ్లు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాల అభివృద్ధి పనులు వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు కాపుల అభ్యున్నతికి రూ.3,160 కోట్ల రుణాలను అందజేసి కాపుల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. అలానే ముస్లిం ల అభ్యున్నతికి ఎన్నడూ లేని విధంగా రూ.1,350 కోట్లు కేటాయించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అన్నారు. రైతుల సంక్షేమానికి ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో తన పోటీ ఖాయమని వెల్లడించడంలో గోరంట్ల అభిమానులు, అనుచరుల్లో ఉత్సాహం నిండింది. ఆయన పోటీపై వస్తోన్న వార్తలకు తెరపడినట్లయ్యింది.
