Sat Dec 07 2024 01:57:52 GMT+0000 (Coordinated Universal Time)
గంటా అలా ఉపయోగపడ్తారనేనా?
గంటా శ్రీనివాసరావుకు చాలా రోజుల తర్వాత పార్టీ నుంచి ఆహ్వానం పంపారు. చంద్రబాబుతో జరిగే సమావేశానికి హాజరు కావాలని కోరారు
గంటా శ్రీనివాసరావు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కీలక నేత. ఆయన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారా? అంటే ఉన్నారు అని చెప్పుకోవాలి. లేరు అని అనుకోవాలి. ఆయన 2019 ఎన్నికల ఫలితాల నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఎటువంటి పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం లేదు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు, సమస్యలను పరిష్కారం చేయడానికే గంటా శ్రీనివాసరావు పరిమితమవుతున్నారు.
మూడేళ్లలో ఒక్కసారి....
తెలుగుదేశం పార్టీలో ఈ మూడేళ్లలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నా ఆయన పెద్దగా స్పందించలేదు. చంద్రబాబు 36 గంటల దీక్ష చేసినప్పడు కూడా అటు వైపు చూడలేదు. ఆయన కావాలనే పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. చంద్రబాబు కూడా గంటా శ్రీనివాసరావు విషయంలో ఎక్కువగా ఆలోచించడం సరికాదని ఆయన కూడా ఇన్నాళ్లు పట్టించుకోలేదు. కానీ ఆయన కదలికలను చూసిన తర్వాత గంటాను తిరిగి టీడీపీలో యాక్టివ్ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.
కాపు సామాజికవర్గం....
గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం కాపు సామాజికవర్గం నేతలను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాపులకు అధికారం దక్కాలని ఆయన సమాలోచనలు జరుపుతున్నారు. కాపు సామాజికవర్గం నేతలతో పాటు మేధావులు, రిటైర్డ్ అయిన అధికారులను ఒకచోట చేర్చి ప్రణాళికను రూపొందించనున్నారు. ఇప్పటికే పలు దఫాలు సమావేశాలు జరిపారు. కాపు సామాజికవర్గంలో కీలకంగా ఉన్న గంటా శ్రీనివాసరావు పార్టీకి దూరం కాకుండా ఉండేలా చూడాలని ఇప్పటికే చంద్రబాబు నిర్ణయించుకున్నారని తెలిసింది.
హాజరవుతారా? లేదా?
అందుకే గంటా శ్రీనివాసరావుకు చాలా రోజుల తర్వాత పార్టీ నుంచి ఆహ్వానం పంపారు. నేడు చంద్రబాబుతో జరిగే సమావేశానికి హాజరు కావాలని కోరారు. గంటా శ్రీనివాసరావుతో పాటు ఉత్తరాంధ్రలోని మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఎమ్మెల్యేలతో పాటు పార్టీ కీలక నేతలను కూడా చంద్రబాబు సమావేశానికి పిలిచారు. మరి ఈరోజు జరిగే సమావేశానికి గంటా శ్రీనివాసరావు వస్తారా? రారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story