బాబులో విశ్వాసం పెరిగింది...!

ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. దాదాపు 95 శాతం మంది ప్రజలు వివిధ సంక్షేమ పథకాల అమలులో సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తనకు ఫీడ్ బ్యాక్ ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు కలెక్టర్ల సమావేశంలో మాట్లాడారు. కేంద్రం నుంచి తాను బయటకు రావాల్సిన కారణాలను చంద్రబాబు మరోసారి వివరించారు. విభజన సమస్యలను అధిగమించే సమయంలో కేంద్రం ఏపీకి సహకరించడం మానేసిందన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం, ఏపీ విభజన హామీలు అమలు చేయడం కోసమే తాను ఎన్డీఏతో పొత్తుపెట్టుకున్నానని చంద్రబాబు వివరించారు.
అందుకే కేంద్రంపై.....
గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, విభజనతో అన్యాయం ఏపీకి జరిగినా దానిని దిద్దుబాటు చేసేందుకు కేంద్రప్రభుత్వం పూనుకోక పోవడం వల్లనే బీజేపీతో తెగదెంపులు చేసుకున్నామన్నారు. కే్ంద్రం సహకరించకపోయినా అభివృద్ధిలో ఏమాత్రం వెనుకంజ వేసే ప్రసక్తి లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందేనన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను సక్రమంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు. రాజకీయ జోక్యం లేకుండా నిజమైన లబ్దిదారులకు ఫథకాలు చేరేలా చూడాలన్నారు.
95 శాతం మంది సంతృప్తి....
రాష్ట్రంలో ఏ పేదవాడూ బాధపడకూడదన్నదే తన లక్ష్యమన్న చంద్రబాబు, వివిధ పథకాల అమలుపై తాను ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నానని చెప్పారు. ఇందులో ప్రధానంగా పింఛన్లు, పక్కా ఇళ్లు, ఫీజు రీఎంబర్స్ మెంట్ వాటిపైనే ఎక్కువగా వినతులు వస్తున్నాయన్నారు. అయితే ప్రజలు మాత్రం పాలన పట్ల 95 శాతం మంది పూర్తి స్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర విభజన హామీలు, హక్కుల పై ఒకవైపు పోరాడుతూనే మరోవైపు అభివృద్ధి జరగాలని చంద్రబాబు కలెక్టర్లను కోరారు. ప్రజలకు ఇబ్బందుల్లేని పాలన అందించడమే తన లక్ష్యమన్నారు. కలెక్టర్లు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి పథకాల అమలును పర్యవేక్షించాలన్నారు. మొత్తం మీద 95 శాతం మంది ప్రజలు సంతృప్తితో ఉన్నారని చంద్రబాబు తన పాలనపై పూర్తి విశ్వాసాన్ని ప్రకటించుకున్నారు.
