Sun Dec 28 2025 07:35:58 GMT+0000 (Coordinated Universal Time)
నన్ను ఎగతాళి చేశారు.. వారే ఆశ్చర్యపోయారు
మైక్రోసాప్ట్ వచ్చాక హైదరాబాద్ లో ఐటీ విప్లవం వచ్చిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు

మైక్రోసాప్ట్ వచ్చాక హైదరాబాద్ లో ఐటీ విప్లవం వచ్చిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ లో మైక్రోసాప్ట్ డెవలెప్ మెంట్ సెంటర్ ను ప్రారంభించామని తెలిపారు. ఐ.ఎస్.బి. ద్విదశాబ్ది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. విజన్ 2020 లక్ష్యంతో ప్రారంభించిన సంస్థలు ఉజ్వలంగా వెలుగుతున్నాయని చంద్రబాబు అన్నారు. తాను నాటిన మొక్క వృక్షంగా మారడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. 25 ఏళ్ల క్రితం హైదరాబాద్ కు ఇప్పటి హైదరాబాద్ కు ఎంతో తేడా ఉందన్నారు. ఐ.ఎస్.బి బెంగళూరు, చెన్నై, ముంబయి వంటి నగరాలను పరిశీలించిందని, తాను పట్టుబట్టి హైదరాబాద్ కు తీసుకు వచ్చానని ఆయన తెలిపారు.
విద్యార్థులతో ముఖాముఖి...
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్కూల్ విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. హైటిెక్ట సిటీ నిర్మాణం తర్వాత ఎన్నో కంపెనీలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయన్నారు. ప్రపంచ స్థాయి సంస్థలు ఎన్నో ఆవిర్భవించాయని తెలిపరాు. హైదరాబాద్ మాత్రమే మైక్రోసాప్ట్ కు సీఈవోను ఇచ్చిందని ఆయన తెలిపారు. మైక్రోసాప్ట్ వచ్చాక హైదరాబాద్ లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ను ఏర్పాటు చేశానని ఆయన చెప్పారు. బిల్ గేట్స్ ను పది నిమిషాలు సమయం కోరి 45 నిమిషాలు వివరించామని చెప్పారు. పారిశ్రామికవేత్తలను ఒప్పించి ఐ.ఎస్.బి.ని హైదరాబాద్ కు తెచ్చానని తెలిపారు.
2047 నాటికి భారత్...
భారతీయ యువత చాలా శక్తిమంతమైనదని ఆయన పేర్కొన్నారు. 2047 నాటికి భారత్ సంపదను సృష్టించే దేశంగా మారుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. తాను విజన్ 2020 అన్నప్పుడు చాలా మంది తనను ఎగతాళి చేశారన్నారు. తన విజన్ ఇప్పుడు నిజమైందని ఆయన చెప్పారు. రానున్న కాలంలో ఎక్కువ ఉద్యోగాలను సృష్టించే దేశంగా భారత్ ఉంటుందని ఆయన చెప్పారు. పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. హైదరాబాద్ మణిహారం 162 కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్డు అని ఆయన అన్నారు. దూరదృష్టితో హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దామని తెలిపారు.
ఎగతాళి చేశారని...
తాను రాజకీయాల అంశాలను ప్రస్తావించ దలచుకోలేదని, ఏపీలో అమరావతిని కూడా ఇలాగే అభివృద్ధి చేయాలని భావించానని తెలిపారు. ఆంధ్రప్రజలు వ్యాపార రంగంలో నిపుణులని, కోస్తాతీరం ఎంతో ఉందని, ఏపీ అభివృద్ధి సాధ్యమవుతుందని భావించానని తెలిపారు. కొత్త ప్రభుత్వం వచ్చి తన విజన్ ను నాశనం చేసిందని తెలిపారు. దీనివల్ల యువత నష్టపోవాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట విభజన తర్వాత 2029 విజన్ ను లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి సమానంగా సాగాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఏపీని నాలెడ్జ్ హబ్ గా మార్చాలనుకున్నానని తెలిపారు. తాను ప్రారంభించిన ఐ.ఎస్.బి. ప్రాంగణాన్ని ఆయన కలియతిరిగారు.
Next Story

