దాచేపల్లి అత్యాచారాలకు కేరాఫ్ గా ...?

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్ట్టించిన గుంటూరు జిల్లా దాచేపల్లిలో మళ్ళీ అలాంటి సంఘటనతో అలజడి రేపింది. 9 ఏళ్ళ బాలికపై వృద్ధుడు అత్యాచారం చేసి ఆ తరువాత ఆత్మహత్యకు పాల్పడటం అందరికి తెలిసిందే. ఆ సంఘటన ప్రతిపక్షాలకు ఆయుధంగా దొరికింది. అధికార విపక్షాలు రోడ్డున పడి కొట్టుకున్నంత పని చేశాయి. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డకు రక్షణ పేరుతో చంద్రబాబు చైతన్య కార్యక్రమాలు చేపట్టారు కూడా. అయినప్పటికీ దాచేపల్లిలో దారుణాలు ఆగింది లేకుండా పోయింది.
టిడిపికి నేరుగా మచ్చ పడింది ...
తాజాగా దాచేపల్లిలో కొంత ఆలస్యంగా మరో అరాచకం వెలుగుచూసింది. టిడిపి జెడ్పి కో ఆప్సన్ సభ్యుడు వలి అనే వ్యక్తి తన షాపులో ఉద్యోగం చేస్తున్న ఒక బాలికపై అత్యాచారం చేశాడు. ఈ విషయం వెలుగులోకి రాకుండా కొంతకాలం జాగ్రత్త పడినా బాలిక గర్భవతి కావడంతో వలి నిర్వాకం బయటపడింది. గురజాల ఆసుపత్రికి బాలికను తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి నిందితుడు వలిని అరెస్ట్ చేశారు పోలీసులు. ముందు జాగ్రత్త చర్యగా భారీ స్థాయిలో పోలీసులను గ్రామంలో మోహరించారు. గత అనుభవాల దృష్ట్యా ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు ఆ ప్రాంతంలో చోటు చేసుకుంటాయనే భయంతో ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ కేసులో నేరుగా టిడిపి మరోసారి ఇరుకున పడింది.
