కాంగ్రెస్ కు పెద్దాయన ఇలా ఝలక్ ఇచ్చారే....!

దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రతిష్ట మసకబారిన వేళ ఇప్పుడు రాజకీయ సెగ దానికి మరింత తగులుతుంది. సాక్షాత్తు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ను అభిశంసిస్తూ 60 మంది ఎంపీలతో కూడిన నోటీసును కాంగ్రెస్ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి అందజేసింది. ఈ నోటీసుకు మద్దతు పలుకుతూ కాంగ్రెస్ పార్టీ సహా ఏడు పార్టీలకు చెందిన వారు సంతకాలు చేశారు. ఆ పార్టీల్లో శరద్ పవర్ ఎన్సీపీ, సమాజ్ వాదీ పార్టీ, ముస్లిం లీగ్, బహుజన్ సమాజ్ పార్టీ, వామపక్షాలు వున్నాయి. ఈ నోటిస్ కు మమతాబెనర్జీ పార్టీ తృణమూల్ దూరంగా ఉండటం, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతకం చేయకపోవడం చర్చనీయాంశం అయ్యింది.
జడ్జీ లను భయపెట్టేందుకు .....
సుప్రీం ప్రధాన న్యాయమూర్తిని టార్గెట్ చేయడం ద్వారా ఇతర న్యాయమూర్తులను భయపెట్టేందుకే ఈ చర్యలకు కాంగ్రెస్ ఇతర పక్షాలు దిగాయని బిజెపి ఆరోపించింది. న్యాయ వ్యవస్థపై వత్తిడి తెచ్చేందుకే కాంగ్రెస్ విపక్షాలు సిద్ధం కావడాన్ని బిజెపి తప్పుపట్టింది. ఇదిలా ఉండగా అభిశంసన అంశానికి సంబంధించి ముందుగా కాంగ్రెస్ నేతృత్వంలో పలు పార్టీలు సమావేశం అయ్యి విస్తృతంగా చర్చించాయి. అనంతరం అభిశంసనకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ వెల్లడించారు. దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని బలపరిచేందుకే ఈ చర్య అంటుంది కాంగ్రెస్. మరి ముందు ముందు ఏమి జరగనుందో చూడాలి.
