ఎవరి సన్నాహాలు వారివేనా?

రేపటితో పార్లమెంటు సమావేశాలు ముగియనున్నాయి. గత 11 రోజులుగా అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండానే సభ వాయిదా పడుతూ వస్తోంది. ఈరోజు అయినా అవిశ్వాసం చర్చకు వస్తుందని టీడీపీ, వైసీపీ ఎంపీలు ఆశతో ఎదురు చూస్తున్నారు. పట్టు వదలకుండా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎంపీలు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అయితే అన్నాడీఎంకే సభ్యులు కావేరీ జలాల మండలిని ఏర్పాటు చేయాలంటూ రోజూ సభలో రచ్చ చేస్తున్నారు. దీంతో సభ వాయిదా వేస్తున్నారు స్పీకర్ సుమిత్రా మహాజన్. సభ గందరగోళంలో ఉండటంతో తాను అవిశ్వాసానికి మద్దతుగా ఎందరు సభ్యులున్నారన్నది లెక్కించలేకపోతున్నానని ఆమె నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.
ఈరోజు కూడా....
ఈరోజు కూడా అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన విరమించే అవకాశం లేదు. కావేరి జలాల బోర్డు ఏర్పాటు చేయాలంటూ ఈరోజు తమిళనాడు మొత్తం బంద్ కు పిలుపునిచ్చాయి విపక్షాలు. రాష్ట్రంలో ఆందోళన జరుగుతున్నప్పుడు అన్నాడీఎంకే పార్టీ ఎంపీలు లోక్ సభలో ఆందోళన విరమిస్తారని అనుకోలేం. దీంతో ఈరోజు కూడా అవిశ్వాసం చర్చకు వచ్చే అవకాశం లేదు. ఈరోజు, రేపు మాత్రమే సభ జరగనుంది. ఈ రెండు రోజుల్లో చర్చకు రాకుంటే అవిశ్వాసం అటకెక్కినట్లేనని చెప్పక తప్పదు. అయితే ప్రభుత్వం భయపడుతుందన్న విమర్శలకు చెక్ పెట్టేందుకు అవిశ్వాసంపై చర్చకు సిద్ధమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.
హస్తినకు చేరుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు....
ఇక టీడీపీ, వైసీపీలు మాత్రం తమ వ్యూహాలు తాము రచించుకుంటున్నాయి. వైసీపీ ఎంపీలు రేపు సభ నిరవధికంగా వాయిదా పడిన వెంటనే వైసీపీ ఎంపీలు రాజీనామా చేయనున్నారు. రాజీనామా చేసిన అనంతరం ఏపీ భవన్ కు వెళ్లి ఆమరణ దీక్షకు దిగనున్నారు. ఎంపీల దీక్షకు సంఘీభావంగా వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలందరూ ఈరోజు ఢిల్లీకి చేరుకుంటారు. ఎంపీల ఆమరణ దీక్షలో ఎమ్మెల్యేలు ఒకరోజు పాల్గొంటారు. ఇక తెలుగుదేశం పార్టీ కూడా పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయించుకుంది.
వ్యూహరచనలో టీడీపీ......
చంద్రబాబు ఇప్పటికే రెండు రోజుల ఢిల్లీ పర్యటన పూర్తి చేసుకుని వచ్చారు. జాతీయ స్థాయిలో మోడీ ఏపీకి చేసిన అన్యాయాన్ని హస్తిన వేదికగా చంద్రబాబు ఎండగట్టగలిగారు. అయితే పార్లమెంటు సమావేశాలు నిరవధిక వాయిదా పడిన వెంటనే తెలుగుదేశం కూడా ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు సాధన కోసం కార్యాచరణ రూపొందించుకుంటోంది. ఈ మేరకు చంద్రబాబు సీనియర్ నేతలతో ఈరోజు సమావేశం అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి ఎలా తేగలమన్న దానిపై వ్యూహరచన చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉద్యమ కార్యాచరణకు టీడీపీ పూనుకుంటోంది. మొత్తం మీద పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ఉద్యమాలతో వేడెక్కనుంది.
