Chiranjeevi Cyber Crime complaint: డీప్‌ఫేక్ అసభ్య వీడియోలపై చిరంజీవి సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు
ప్రతిష్ట దెబ్బతీయడమే లక్ష్యమని ఆరోపణ

హైదరాబాద్: సినీనటుడు, మాజీ కేంద్ర మంత్రి కొణిదెల చిరంజీవి తన పేరు, రూపాన్ని ఉపయోగించి డీప్‌ఫేక్ టెక్నాలజీతో రూపొందించిన అసభ్య వీడియోలు నెట్లో ప్రచారం చేస్తున్న అనేక అశ్లీల వెబ్సైట్లపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అక్టోబర్ 25న ఇచ్చిన లిఖిత పూర్వక ఫిర్యాదులో, కొందరు వెబ్సైట్లు తన రూపంలో కృత్రిమ మేధ (AI) సహాయంతో అసభ్య దృశ్యాలు సృష్టించి వ్యాప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఇది తన గౌరవం, ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో చేసిన చర్యగా పేర్కొన్నారు.
చట్టపరమైన చర్యలు కోరారు
సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి, అవసరమైతే ఇతర నిబంధనల కిందనూ చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆయన కోరారు. ఈ వీడియోలు రూపొందించడం, ప్రచారం చేయడం వెనుక ఒక పాకాడ్బంది సైబర్ నెట్వర్క్ ఉందని, దానిని గుర్తించి శిక్షించాల్సిన అవసరం ఉందని వివరించారు.
“ప్రతిష్టకు తీవ్ర నష్టం”
“ఈ వీడియోలు నా గౌరవం, వ్యక్తిగత గోప్యతకు తీవ్రమైన, శాశ్వత నష్టం కలిగిస్తున్నాయి” అని చిరంజీవి ఫిర్యాదులో తెలిపారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద తన గోప్యతా హక్కు ఉల్లంఘించబడిందని పేర్కొన్నారు.
ఇలాంటి కంటెంట్ ప్రచారం నిరోధించేందుకు ఇప్పటికే హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి నుంచి తాత్కాలిక నిషేధాజ్ఞ కూడా పొందినట్లు తెలిపారు.
తక్షణ విచారణ కోరారు
వీడియోల మూలం, సృష్టించిన వారు, అప్లోడ్ చేసిన వారిని గుర్తించేందుకు సాంకేతిక దర్యాప్తు చేపట్టాలని, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి కంటెంట్ తొలగించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని వేగంగా చర్యలు చేపట్టాలని, వీడియోల కొనసాగుతున్న ప్రచారం తన మానసిక ఆరోగ్యానికీ, గౌరవానికీ నష్టం కలిగిస్తోందని పేర్కొన్నారు.

