Chiranjeevi: చిరంజీవిపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు
సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ కేంద్ర మంత్రి

సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి కొణిదెల చిరంజీవి సోషల్ మీడియా వేదికలలో తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
"దయా చౌదరి” పేరుతో ఉన్న అకౌంట్‌తో పాటు మరికొన్ని హ్యాండిల్స్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాయని ఫిర్యాదులో చిరంజీవి తెలిపారు. తనకు ఆ వ్యక్తులు తెలియరని, నగర సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి తనకు అనుకూలంగా ఇచ్చిన కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఈ దూషణలు కొనసాగుతున్నాయని చెప్పారు.
ఆన్లైన్ వేధింపులపై దర్యాప్తు కోరుతూ
సైబర్ క్రైమ్ అసిస్టెంట్ కమిషనర్‌కు పంపిన లిఖిత పత్రంలో చిరంజీవి, ఆన్లైన్ వేధింపులపై దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు. తన తరఫున న్యాయవాది సార్ చాగ్లాకు పూర్తి అధికారాలు ఇచ్చినట్లు తెలిపారు. అసభ్య భాష వాడకంతో తన గౌరవానికి భంగం కలిగిందని, మానసికంగా తీవ్రంగా బాధపడ్డానని వివరించారు.
పోలీసులు ఫిర్యాదు రాత్రి 9 గంటల సమయంలో అందిందని, ప్రాథమిక పరిశీలన అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫిర్యాదులో పేర్కొన్న హ్యాండిల్స్ వివరాలు ధృవీకరించిన తర్వాత తదుపరి చర్యలు ప్రారంభిస్తామని చెప్పారు.

