Tue Mar 31 2026 15:00:25 GMT+0530 (India Standard Time)
ఆ ఏడుగురి ఎమ్మెల్యేలకు జగన్ వార్నింగ్
గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో కొందరు ఎమ్మెల్యేలు పాల్గొన లేదని జగన్ సమావేశంలో నిర్మొహమాటంగా చెప్పారు

గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో కొందరు ఎమ్మెల్యేలు పాల్గొన లేదని జగన్ సమావేశంలో నిర్మొహమాటంగా చెప్పారు. బొత్స సత్యనారాయణ, ఆళ్లనాని, శిల్పా చక్రపాణిరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, వసంత కృష్ణ ప్రసాద్ లు ఒక్క రోజు కూడా గడప - గడప కార్యక్రమంలో పాల్గొనలేదని ముఖ్యమంత్రి జగన్ వర్క్ షాపులో చెప్పారు. ఐప్యాక్ టీం ఇచ్చిన నివేదికను జగన్ ఎమ్మెల్యేల ముందు ఉంచారు.
వచ్చే ఆరునెలలు....
పది రోజుల కంటే తక్కువ పాల్గొన్న ఎమ్మెల్యేల గురించి కూడా జగన్ ప్రస్తావించినట్లు తెలిసింది. మొదటి నెల కావడంతో వదిలేస్తున్నానని, ఇకపై ఈ కార్యక్రమంపై అలక్ష్యాన్ని ప్రదర్శిస్తే ఉపేక్షించబోనని జగన్ వార్నింగ్ ఇచ్చినట్లు చెబుతున్నారు. వచ్చే ఆరు నెలలు ఎమ్మెల్యేలపై పర్యవేక్షణ ఉంటుందని, ఆరు నెలలు తర్వాత నివేదికను బట్టి చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి జగన్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజంటేషన్ ఇచ్చారు.
విపక్షాలకు చెందిన....
ఎక్కువ రోజులు ప్రజల్లో ఉండాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ఇంటింటా ఏం మేలు జరిగిందో వారికి వివరించాలని తెలిపారు. వచ్చే ఎన్నికలలో 175 సీట్లు సాధించడం పెద్ద విషయం కాదని, గతంలో ఎన్నడూ లేని విధంగా కుప్పంలో మున్సిపాలిటీని క్లీన్ స్వీప్ చేసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా జగన్ గుర్తు చేశారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారి ఇళ్లకు వెళ్లి కూడా ప్రభుత్వం చేసిన మంచిని వివరించాలని జగన్ ఆదేశించారు.
సమస్యలు ప్రస్తావిస్తే....
అయితే కొందరు ఎమ్మెల్యేలు జగన్ కు ప్రజల నుంచి వస్తున్న సమస్యలను కూడా వివరించారు. ముస్లిం యువతులకు షాదీ ముబారక్ ఇవ్వాలని ఎమ్మెల్యేలు కోరడంతో సాధ్యం కాదని జగన్ తెగేసి చెప్పారు. అమ్మఒడి పథకం ముస్లిం పథకం కూడా వర్తిస్తుంది కదా? అని అన్నారు. అమ్మఒడి పథకంలో కోత పెట్టారని, నియోజకవర్గానికి ఏడు నుంచి ఎనిమిది వేలు కట్ చేశారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నట్లు తెలిసింది. దీనికి జగన్ సమాధానమిస్తూ గత రెండేళ్లుగా పొరపాటున ఇచ్చిన వారికి కట్ చేశారని, నిబంధనల ప్రకారం అమ్మఒడి రాకపోతే చెప్పాలని, ఎమ్మెల్యేలు మార్గదర్శకాలు చదవాలని జగన్ కోరారు. కార్యకర్తలు చేసిన పనులకు బిల్లులు రాలేదని కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి సీఎం దృష్టికి తీసుకు వచ్చారు. విద్యుత్తు కూడా గ్రామాల్లో ఉండటం లేదని చెప్పారు. మనకు వ్యతిరేకంగా ప్రసారం చేసే కథనాలు చూసి మాట్లాడవద్దని, బొగ్గు ఎంత ఖర్చయినా వెచ్చించి విద్యుత్తు కోత లేకుండా చూస్తున్నామని జగన్ జవాబిచ్చారు.
Next Story

