Sat Mar 28 2026 19:17:06 GMT+0530 (India Standard Time)
తోడేళ్లన్నీ ఒక్కటవుతున్నాయ్.. సీఎం జగన్
ఈ రోజు రాష్ట్రంలో జరిగేది క్లాస్ వార్ అని పేదవాళ్లు ఒకవైపు ఉంటే, పెత్తందార్లు మరో వైపు ఉన్నారని ముఖ్యమంత్రి జగన్ అన్నా

ఈ రోజు రాష్ట్రంలో జరిగేది క్లాస్ వార్ అని పేదవాళ్లు ఒకవైపు ఉంటే, పెత్తందార్లు మరో వైపు ఉన్నారని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఒక్కడినే సింహంలా వస్తానని చెప్పారు. తమకు ఎవరితో పొత్తులు లేవన్నారు. తోడేళ్లందరూ ఒక్కటై వస్తున్నారన్నారు. నాకు ముసలాయన మాదిరి మీడియా తోడు ఉండకపోవచ్చని, దత్తపుత్రుడి అండ లేకపోవచ్చు గాని, తాను మాత్రం ఎస్సీ, బీస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను నమ్ముకున్నానని జగన్ అన్నారు. వినుకొండలో జరిగిన జగనన్న చేదోడు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ప్రతి నిరుపేద కుటుంబానికి...
రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి ఈ ప్రభుత్వం చేయూతనిస్తుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. జగనన్న చేదోడు పథకం మూడో విడత నిధులను విడుదల చేశారు. ఏపీ వ్యాప్తంగా 3.30 లక్షల మందికి లబ్ది చేకూర్చేలా 330 కోట్లను ఈ పథకం కింద విడుదల చేయనున్నారు. ప్రతి లబ్దిదారునికి పదివేల రూపాయలు బ్యాంకు ఖాతాలో జమచేస్తున్నామని వైఎస్ జగన్ తెలిపారు. గిట్టని వాళ్లు రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
తప్పుడు ప్రచారం...
పేదలకు సాయం చేస్తుంటే ఓర్వలేక పోతున్నారని జగన్ అన్నారు. ఈ మూడేళ్లలో 927 కోట్ల రూపాయలు జగనన్న చేదోడు పథకం కింద నిధులను విడుదల చేశామని తెలిపారు. దర్జీలు, నాయీబ్రాహ్మణలు, రజకులకు ఈ సాయం అందిస్తున్నామని తెలిపారు. వివిధ పథకాల ద్వారా లక్షల కోట్ల నిధులను ఇస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వాలు బలహీన వర్గాలను పట్టించుకోలేదన్నారు. దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అగ్రగామిగా నిలిచిందని చెప్పారు. గతంలో డ్వాక్రా మహిళలకు రుణాలను మాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారని ఆయన ఆరోపించారు.
సంక్షేమంలో ఏపీ...
కరోనా సమయంలోనూ వారిని ఆదుకోగలిగామని చెప్పారు. నవరత్నాల ద్వారా ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలను అందించామని తెలిపారు. రాష్ట్రం 11.39 శాతం గ్రోత్ రేట్ తో దూసుకుపోతుంటే, గిట్టని వాళ్లు తప్పుడు ప్రచారానికి దిగుతున్నారన్నారు. 27 లక్షల మందికి చేయూత పథకం ద్వారా నిధులను అందించామని తెలిపారు. గత ప్రభుత్వాలు చేసిన అప్పులు కంటే ఈ ప్రభుత్వం తక్కువే చేసిందన్నారు. గతంలో ఎందుకు ఇన్ని సంక్షేమ పథకాలు అమలు జరగలేదో ఆలోచన చేయమని జగన్ కోరారు. లంచంలేకుండా పారదర్శకంగా నిధులను లబ్దిదారులకు అందజేస్తున్నామని తెలిపారు. దుష్టచతుష్టయం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని జగన్ పిలుపు నిచ్చారు.
Next Story

