Sat Dec 06 2025 08:48:46 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్టీఆర్ కు జగన్ నివాళి .. ఈ రూపంలో
ఎన్టీఆర్ పేరిట కొత్త జిల్లా ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ తొలుత ఇచ్చిన హామీని అమలు పర్చారు.

ఎన్టీఆర్ పేరిట కొత్త జిల్లా ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ తొలుత ఇచ్చిన హామీని అమలు పర్చారు. విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేయబోయే కొత్త జిల్లాకు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరును పెట్టాలని నిర్ణయించారు. ఈ జిల్లాలో విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు నియోజకవర్గాలను చేర్చారు. మచిలీపట్నం కేంద్రంగా కృష్ణా జిల్లాను ఏర్పాటు చేయనున్నారు.
అలాగే కృష్ణా జిల్లా...
కృష్ణా జిల్లా పేరును తొలగించవద్దని కొందరు చేసిన సూచనల పరిగణనలోకి తీసుకుని మచిలీపట్నం కేంద్రంగా ఉన్న జిల్లాకు కృష్ణా జిల్లా పేరును కంటిన్యూ చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో పెడన, అవనిగడ్డ, పామర్రు, మచిలీపట్నం, పెనమలూరు, గన్నవరం, గుడివాడ నియోజకవర్గాలను చేర్చనున్నారు. కృష్ణా నదికి ప్రాముఖ్యత ఉండటంతో ఆ పేరును మచిలీపట్నం కేంద్రంగా ఉండే జిల్లాకు ఉంచనున్నారు.
అల్లూరి పేరిట...
అల్లూరి సీతారామరాజు పేరుతో కొత్త జిల్లా ఏర్పాటుకానుంది. పాడేరు కేంద్రంగా ఈ కొత్త జిల్లా ఏర్పాటు కాబోతుంది. ఈ జిల్లా పరిధిలో పాడేరు, అరకు, రంపచోడవరం నియోజకవర్గాలను చేర్చారు. ఇక పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లాను కొత్తగా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ జిల్లా పరిధిలో పాలకొండ, పార్వతీపురం, కురుపాం, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాలుంటాయి. గిరిజనులు అత్యధికంగా నివసించే ఈ ప్రాంతంలో రెండు జిల్లాలు కొత్తగా ఏర్పాటు కాబోతున్నాయి.
మన్యం జిల్లా తో...
ఇక మహనీయులు పొట్టి శ్రీరాములు పేరును అలాగే ఉంచుతారు. నెల్లూరు జిల్లా కేంద్రంగా ఉండే ఈ జిల్లాలో నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కోవూరు, సర్వేపల్లి, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, కందుకూరు నియోజకవర్గాలుండనున్నాయి. ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గం పొట్టి శ్రీరాములు జిల్లాలోకి వెళ్లనుంది. వైఎస్సార్ జిల్లాను కూడా అలాగే ఉంచనున్నారు. కడప కేంద్రంగా ఉండే ఈ జిల్లాలో కడప, కమలాపురం, జమ్మలమడుగు, పులివెందుల, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాలు ఉండనున్నాయి.
Next Story

