ఆ ఏడుగురు మంత్రులపై బాబు సీరియస్

టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశాలను ఆయన మంత్రులే లైట్ తీసుకుంటున్నారా? టీడీఎల్పీ సమావేశానికి ఏడుగురు మంత్రులు గైర్హాజరవ్వడంపై చంద్రబాబు మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని, అందుకు అనుగుణంగా నడుచుకోవాలనిన ఆయన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు.
ముందస్తు కార్యక్రమాలు ఉండటంతో.....
కాగా ఈ సమావేశానికి ఏడుగురు మంత్రులు గైర్హాజరవ్వడంపై చంద్రబాబు మండిపడ్డారు. మంత్రులకే సీరియస్ నెస్ లేకుంటే ఇక క్యాడర్ కు ఎలా ఉంటుందని ఆయన ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా శాసనసభ సమావేశాలు పూర్తి కావడంతో కొందరు మంత్రులు తమ నియోజకవర్గాల్లో ముందుగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాలకు వెళ్లినట్లు సమాచారం ఇచ్చారు. అయినా చంద్రబాబు శాంతించలేదు. తాను సీరియస్ గా సమావేశం పెడితే కార్యక్రమాల పేరుతో వెళ్లడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
త్వరలోనే బస్సు యాత్ర.....
ఇక ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను చంద్రబాబు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించారు. ప్రజలకు ఏపీకి కేంద్రం చేసిన మోసంతో పాటు, వైసీపీ, జనసేన పార్టీలు ఆడుతున్న డ్రామాలను కూడా వివరించాలని చంద్రబాబు పేర్కొన్నారు. పార్లమెంటు సభ్యుల బస్సుయాత్ర తేదీని తాను త్వరలోనే ఖరారు చేస్తానని, తాను మూడు చోట్ల జరిగే సభల్లో పాల్గొంటానని చంద్రబాబు సమావేశంలో వెల్లడించారు. క్యాడర్ పట్టు సడలకుండా వారిలో ధైర్యం పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు.
పవన్, బీజేపీ, జగన్ ఒక్కటే.....
ఇటు క్షేత్రస్థాయిలోనూ, అటు ఢిల్లీలోనూ పోరాటం చేస్తూ ప్రజల్లోకి వెళదామని చంద్రబాబు సూచించారు. టీడీపీ వల్లనే రాష్ట్రం బాగుపడుతుందన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బాబూ సూచించారు. బీజేపీ టీడీపీని దెబ్బ తీయడానికి అనేక వ్యూహాలు రచించే అవకాశముందని అప్రమత్తంగా ఉండాలని కోరారు. అంతేకాదు జగన్, పవన్ లను బీజేపీ వాడుకుంటుందన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చంద్రబాబు కోరారు.
