Tue Dec 30 2025 07:17:58 GMT+0000 (Coordinated Universal Time)
ఎవరీ వరుణ్ రెడ్డి.. ఆ పేరును చంద్రబాబు ఎందుకు ప్రస్తావించారు?
ఏపీలో జగన్ వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తున్నారని, జైళ్లలో కూడా రక్షణ లేకుండా పోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు

ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తున్నారని, జైళ్లలో కూడా రక్షణ లేకుండా పోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లాలో వరుణ్ రెడ్డి జైలరుగా ఉన్నప్పుడు ఆ జైలులో మొద్దు శ్రీను హత్య జరిగిందని చంద్రబాబు చెప్పారు. పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు మొద్దు శ్రీనును హతమార్చింది వరుణ్ రెడ్డి జైలరుగా ఉన్న జైలులోనేనని చంద్రబాబు చెప్పారు.
శాఖాపరమైన కేసులున్నా...
వరుణ్ రెడ్డిపై అనేక శాఖపరమైన కేసులున్నాయని, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలను ఆయనను పక్కన పెట్టాయని చంద్రబాబు తెలిపారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వరుణ్ రెడ్డి క్లీన్ చిట్ ఇచ్చి కడప జైలరుగా నియమించారని తెలిపారు. కడపలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులు ఉన్నారని, వారిని కూడా చంపేయడానికే వరుణ్ రెడ్డిని అక్కడకు పంపావా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
అనేక మందిపై...
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును పరామర్శించేందుకు వచ్చిన చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ముగ్గురు మాజీ మంత్రులు, ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారన్నారు. ఏ ఒక్క కేసు నిలబడలేదన్నారు. కేవలం భయభ్రాంతులను చేయడానికే టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కేసును సమీక్షించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు.
Next Story

