Thu Sep 12 2024 13:37:47 GMT+0000 (Coordinated Universal Time)
కొడాలినానికి ఓటమి తప్పదా? బాబు లెక్కలివేనా?
గుడివాడలో కొడాలి నానిని ఓడించాలన్న టార్గెట్ తోనే చంద్రబాబు ఉన్నారు. నాలుగు సార్లు నాని గుడివాడ నుంచి విజయం సాధించారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు వైసీపీలో ప్రధాన శత్రవు ఎవరైనా ఉన్నారా? అంటే జగన్ తర్వాత ఉన్న నేత కొడాలి నాని మాత్రమే. కొడాలి నాని టీడీపీలో ఉండి గుడివాడలో పాతుకుపోయారు. సరే వైసీపీలోకి వెళితే ఇబ్బంది లేదు. తనను, తన కుటుంబ సభ్యులను నిత్యం వ్యక్తిగతంగా దూషించడమే పనిగా పెట్టుకున్నారు. 2014లో అధికారంలోకి తెలుగుదేశం పార్టీ వచ్చినా కొడాలి నానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సొంత సామాజికవర్గం నుంచి కొంత వ్యతిరేకత వస్తుందన్న కారణంతోనే చంద్రబాబు ఆ దిశగా ప్రయత్నం చేయలేదంటున్నారు.
తన కుటుంబంపై...
2019 ఎన్నికల్లో చంద్రబాబు పార్టీ ఓటమి పాలయింది. కొడాలి నాని జగన్ తొలి మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు. అప్పటి నుంచి కొడాలి నాని చంద్రబాబు కుటుంబాన్ని టార్గెట్ చేశారంటారు. వ్యక్తిగతంగా దూషించడమే కాకుండా చికాకు పుట్టేవిధంగా మాట్లాడుతున్నారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2019 ఎన్నికలలో గుడివాడలో కొడాలి నానిని ఓడించేందుకు చంద్రబాబు దేవినేని అవినాష్ ను రంగంలోకి దించారు. అక్కడ ఇన్ ఛార్జిగా ఉన్న రావి వెంకటేశ్వరరావును పక్కన పెట్టి మరీ దేవినేని అవినాష్ కు అవకాశమిచ్చారు. అయినా కూడా కొడాలి నాని గెలుపును ఆపలేకపోయారు.
నాలుగుసార్లు గుడివాడలో...
గుడివాడలో కొడాలి నానిని ఓడించాలన్న టార్గెట్ తోనే చంద్రబాబు ఉన్నారు. నాలుగు సార్లు కొడాలి నాని గుడివాడ నుంచి విజయం సాధించారు. గుడివాడ లో గోల్ సాధించాలన్న ధ్యేయంతో చంద్రబాబు కొత్త ఎత్తుగడకు దిగారని తెలిసింది. వచ్చే ఎన్నికల్లో కొత్త వ్యక్తిని పోటీలోకి దించుతున్నారని వార్తలు వస్తున్నాయి. అమెరికాలోని అట్లాంటాలో స్థిరపడిన వెనిగండ్ల రామును గుడివాడ టీడీపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ మేరకు చంద్రబాబు ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. వెనిగండ్ల రాము కమ్మ సామాజికవర్గానికి చెందిన వారే.
ఎన్ఆర్ఐని రంగంలోకి దించి...
అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. వెనిగండ్ల రాము కమ్మ సామాజికవర్గానికి చెందిన వారే అయినా ఆయన భార్య ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మహిళ. దీంతో ఇటు కమ్మ, అటు ఎస్సీ, ఎస్టీ వర్గాల ఓట్లను కూడా పొంది కొడాలి నానిని ఓడించే అవకాశముందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. వెనిగండ్ల రాము భార్య తండ్రి గుడివాడ ప్రాంతంలో పేరు గడించిన పాస్టర్ గా కూడా ఉన్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గుడివాడలో కొడాలి నానికి పోటీగా వెనిగండ్ల రామును బరిలోకి దించడం ఖాయంగా మారింది. వచ్చే నెల 5వ తేదీన వెనిగండ్ల రాము గుడివాడలో కాలుమోపుతున్నారని తెలిసింది. ఆయన తన చేతుల మీదుగా అన్నా క్యాంటిన్లను ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద గుడివాడ నానిని ఓడించేందుకు చంద్రబాబు ఈసారి కొత్త ఎత్తుగడలతో 2024 ఎన్నికల్లో వస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Next Story