Wed Jun 29 2022 06:13:55 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు ను ఈసారి నమ్ముతారా?

తెలుగుదేశం పార్టీ అసలే కష్టాల్లో ఉంది. అన్ని రకాలుగా మూడేళ్ల నుంచి ఇబ్బందులు పడుతుంది. మహానాడుతో కొంత ఊపు వచ్చినా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు తొలి నుంచి సంక్షేమ పథకాలకు దూరంగా ఉంటారని పేరు. ఆయన ఎక్కువగా అభివృద్ధిపైనే ఫోకస్ పెడతారు. ఐటీ రంగం, పరిశ్రమల ఏర్పాటు వంటి వాటిపైనే దృష్టిపెడతారు. తనకు తాను సీఎంవోగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ప్రకటించుకున్నారు. చంద్రబాబు హయాంలో ధరలు పెరగలేదంటే ఎవరూ నమ్మరు.
అధికారుల చేతుల్లోకి....
చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఎవరినీ లెక్క చేయరు. ఆయన అధికారుల చేతుల్లోకి వెళ్లిపోతారు. వారు చెప్పినట్లుగానే నడుచుకుంటారు. ముఖ్యమంత్రి గా ఉన్న ప్రతి సమయంలో చంద్రబాబుకు ఈ పేరుంది. విపక్షంలో ఉన్నప్పుడే ఆయనకు ప్రజాసమస్యలు గుర్తిస్తారని ప్రజలు నమ్మే పరిస్థితి ఉంది. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వస్తే జగన్ అమలు చేసే సంక్షేమ పథకాలన్నీ రద్దు చేస్తారన్న టాక్ బలంగా ప్రజల్లోకి ఇప్పటికే వెళ్లింది.
హామీ ఇచ్చినా...
ఒకవేళ తాను ఆ పథకాలన్నింటినీ కొనసాగిస్తానని చంద్రబాబు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి కన్పించడం లేదు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది అంత సులువు కాదు. ఏ ముఖ్యమంత్రి వచ్చినా అదే పరిస్థితి అన్న ధోరణికి ప్రజలు వచ్చేశారు. దీనికి తోడు వచ్చే సంక్షేమ పథకాలను ఎందుకు పోగొట్టుకోవాలన్న భయం ప్రజల్లో నెలకొంటే చంద్రబాబుకు ప్రజలు దూరంగా ఉంటారు. కేవలం కొందరికే చంద్రబాబు ఉపయోగపడతారన్న టాక్ కూడా బలంగా ఉంది.
మూడు రాజధానులు....
ఇక మూడు రాజధానుల వ్యవహారం కూడా ఆయనకు ఇబ్బందిగా మారనుంది. అమరావతిని రాజధానిగా ఆయన కొనసాగిస్తారు. మూడు రాజధానుల ప్రతిపాదన మూలన పడుతుందన్న ఆందోళన మూడు ప్రాంతాల ప్రజల్లో ఉంది. ఇలా చంద్రబాబు వచ్చే ఎన్నికలకు అలివి కాని హామీలిచ్చినా ఫలితం ఎంత మేరకు ఉంటుందన్నది చివర వరకూ చెప్పలేం అంటున్నారు విశ్లేషకులు. చంద్రబాబును అధికారంలోకి వచ్చినా ఒరిగేదేమీ లేదన్న నైరాశ్యం ప్రజల్లో కన్పిస్తుంది. అందుకే చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో గెలుపు అంత సులువు కాదు.
Next Story