Thu Jul 07 2022 08:42:25 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు, జగన్ వల్ల కానిది పవన్ వల్ల అవుతుందా ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నట్లుంది తెలంగాణపైన దృష్టి సారించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆయన పర్యటించారు. హైదరాబాద్ నుంచి కోదాడ వరకు పవన్ కళ్యాణ్‌కు జనసైనికులు భారీగా స్వాగతం పలికారు. తెలంగాణలోనే ఫుల్ టైమ్ పాలిటిక్స్ చేస్తున్న అగ్రనేతలకు వచ్చినట్లుగా పవన్ కళ్యాణ్‌కు రెస్పాన్స్ వచ్చింది. ఈ టూర్లోనే పవన్ కళ్యాణ్ ఒక కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేస్తామని ప్రకటించారు. ఇక్కడ జనసేన జెండా ఎగరాలని జనసైనికులకు పిలుపునిచ్చారు.
తెలంగాణలో పరిమిత పాత్ర పోషిస్తామని, 30 సీట్లలో పోటీ చేస్తామని పవన్ స్పష్టమైన ప్రకటన చేశారు. 15 సీట్లు గెలుస్తామని సైతం ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతి నియోజకవర్గంలో జనసేనకు ఐదారు వేల ఓట్లు ఉన్నాయని, అవి గెలుపోటములను ప్రభావితం చేస్తాయని పవన్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ టూర్, ఎన్నికల్లో పోటీ చేస్తామనే ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది.
ఇప్పటికే తెలంగాణలో పార్టీల సంఖ్య పెరిగిపోయింది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రధానంగా కనిపిస్తున్నా వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారథ్యంలో బీఎస్పీ కూడా చురుగ్గానే ఉన్నాయి. కమ్యూనిస్టులు ఎలాగూ ఉంటాయి. టీడీపీ నేతలు కూడా మేమూ ఉన్నామని అంటున్నారు. దీంతో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడతాయని, ఏ పార్టీ ఎవరి ఓట్లను చీలుస్తుందనేది ఎవరికీ అర్థం కాకుండా మారిపోయింది.
ఇలాంటి పరిస్థితుల్లో నేనూ కూడా వస్తున్నానని పవన్ కళ్యాణ్ ప్రకటించడం మరింత ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో పవన్ కళ్యాణ్‌కు అభిమానులు భారీగానే ఉన్నారు. కానీ, జనసేనకు ఎంత క్యాడర్ ఉందనేదే ప్రశ్నార్థకం. అభిమానులంతా జనసేనకే ఓటు వేస్తారు అని కచ్చితంగా చెప్పలేం. తెలంగాణలో జనసేన పార్టీ నిర్మాణం జరగలేదు. కమిటీలు లేవు. ఇప్పుడు కమిటీలను ఏర్పాటుచేసుకుంటాం, పార్టీని బలోపేతం చేసుకుంటామని పవన్ ప్రకటించారు.
ప్రతి నియోజకవర్గంలో ఐదారు వేల ఓట్లు ఉన్నాయని పవన్ చెప్పిన మాట నిజమే అయి ఉండొచ్చు. కానీ, ఆ ఓట్లు గెలవడానికి ఏ మాత్రం సరిపోవు. గత పార్లమెంటు ఎన్నికల్లో జనసేన మల్కాజ్గిరి ఎంపీ స్థానానికి పోటీ చేసింది. ఇది ఆంధ్రా సెటిలర్లు అధికారంగా ఉండే ప్రాంతం. ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థికి కేవలం 28 వేల ఓట్లే వచ్చాయి. అంటే ఒకటిన్నర శాతం ఓట్లు ఆ పార్టీకి వచ్చాయని అర్థం. ఈ ఓట్లు హోరాహోరీగా పోరు ఉన్న దగ్గర గెలుపోటములను ప్రభావితం చేస్తాయి కానీ జనసేన అభ్యర్థులను మాత్రం గెలిపించలేవు.
ఒకవైపు ఆంధ్రాలో బీజేపీతో పవన్ పొత్తులో ఉన్నారు. కానీ, తెలంగాణలో మాత్రం ఈ పొత్తు ఉందా ? లేదా ? అనేది ఆ పార్టీలకే తెలియడం లేదు. ఒకవేళ ఏపీలో బీజేపీతో కలిసి పోటీ చేయాలనుకుంటే తెలంగాణలో విడివిడిగా పోటీ చేస్తారా అనేది ఇంకా క్లారిటీ లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రా పార్టీలుగా, అక్కడి నేతలుగా ముద్రపడిన వారు తెలంగాణలో రాజకీయం చేయడం సాధ్యమయ్యే పనిగా కనిపించడం లేదు.
ఇందుకు చంద్రబాబు ప్రత్యక్ష ఉదాహరణ. బలమైన నేతలు ఉన్నా, గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని పోటీ చేసినా, చంద్రబాబు స్వయంగా ప్రచారం చేసి అన్ని అస్త్రాలను ఉపయోగించినా ఇక్కడ ఆ పార్టీకి దక్కింది కేవలం రెండు సీట్లే. వారు టీడీపీకి దూరమయ్యారు. ఇక, జగన్ అయితే పరిస్థితిని ముందే గమనించి తెలంగాణను స్వచ్ఛందంగానే వదులుకున్నారు. ఇలా ఇద్దరికీ సాధ్యం కానీ తెలంగాణలో పవన్ రాజకీయాలు చేయగలరా ? చెప్పినట్లుగా 15 సీట్లు గెలిపించగలరా ? అనేది చూడాలి. అయితే, ఇది చాలా చాలా కష్టమైన పని అని మాత్రం ఎవరైనా చెప్పగలరు.
Next Story