మోడీపై బాబు చండ్రనిప్పులు

తన జీవితంలో ముఖ్యమంత్రిగా నిరసన తెలియజేయాల్సి వస్తుందని అనుకోలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. చంద్రబాబు 12 గంటల దీక్షను విరమించారు. రాష్ట్రానికి అన్యాయం జరిగితే తాను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని చెప్పారు. తెలుగుజాతికి జరిగిన అన్యాయాన్ని జాతీయ స్థాయిలో విన్పించగలిగామన్నారు. ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమయిందన్నారు. ఐదుకోట్ల తరుపున తాను దీక్ష చేశానని చెప్పారు. తన దీక్ష ఒక చరిత్ర అని చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీలు తన దీక్షకు మద్దతు తెలపలేదన్నారు. వారి అజెండా వేరే విధంగా ఉందన్నారు. తాను టీడీపీ అధ్యక్షుడిగా దీక్ష చేయలేదని, ఐదుకోట్ల మంది ఆంధ్రుల ముఖ్యమంత్రిగా దీక్ష చేశానని చెప్పారు. స్వప్రయోజనాలను పక్కనపెట్టి విపక్షాలు రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి వెంట నడవాల్సిందేనన్నారు.
అన్యాయంగా రాష్ట్ర విభజన.....
రాష్ట్ర విభజన అన్యాయంగా చేశారన్నారు. ఢిల్లీలో నిరాహార దీక్ష చేశానని, తెలుగు వారికి సమన్యాయం చేయమని ఆరోజు కోరానన్నారు. ఇద్దరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారమార్గం చూపించమని కోరానన్నారు. ఎవరికీ అన్యాయం చేయవద్దని ఆయన సూచించారు. తాము న్యాయం కోసం పోరాడతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నానని చెప్పారు. కానీ కాంగ్రెస్, బీజేపీలు ఆరోజు అవగాహనకు వచ్చి రాష్ట్రాన్ని విభజించారన్నారు. చాలా మంది సమైక్యాంధ్ర కోసం పోరాడితే, తాను మాత్రం రెండు రాష్ట్రాలకూ న్యాయం చేయాలని కోరానన్నారు. అన్యాయం చేసిందే కాకుండా ఏపీని దారుణంగా అవమానించారన్నారు. ప్రత్యేకహోదా రాజ్యసభ సాక్షిగా ప్రకటించారన్నారు. ఎవరూ అడగకుండానే వారే హామీలిచ్చారన్నారు.
అభివృద్ధికోసమే బీజేపీతో పొత్తు......
విభజనతో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికే కేంద్ర ప్రభుత్వంతో చేతులు కలిపానని చెప్పారు. హైదరాబాద్ లాగా అమరావతిని అభివృద్ధిని చేస్తారని చెప్పి తనకు పట్టం కట్టారన్నారు. నాయకుడిగా తనమీద నమ్మకంపెట్టుకున్న ప్రజలకు న్యాయం చేయడానికే బీజేపీతో పొత్తు పెట్టుకున్నానన్నారు. నాలుగు సీట్లు పోయినా రాష్ట్రం కోసమే బీజేపీతో కలిశానని చెప్పారు. టీడీపీ ఎప్పుడూ అధికారం కోసం పాకులాడ లేదన్నారు. తిరుపతి, అమరావతిలో ప్రధాని నరేంద్రమోడీ ఏం చెప్పారని చంద్రబాబు ప్రశ్నించారు. చెప్పిన మాటలనే అమలు చేయాలని తాను కోరుతున్నానన్నారు. ప్రత్యేక హోదాపై రకరకాలుగా విన్యాసాలు చేశారన్నారు. తనను కొందరు ప్రశ్నిస్తున్నారని, నాలుగేళ్లలో ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించలేదని అడుగుతున్నారని, కాని వారికి సమాధానం చెప్పాల్సిన పనిలేదన్నారు. తనకు పేద ప్రజలే హైకమాండ్ అని చెప్పారు. నాలుగేళ్ల నుంచి సామ,దాన, దండోపాయాలు ఉపయోగించాలని పెద్దలు చెప్పినట్లే తాను వ్యవహరించారన్నారు.
తానే అందరికంటే సీనియర్.....
కేంద్రంలో ఉండే నాయకులకంటే తాను సీనియర్ నని, తన కంటే తర్వాత వచ్చిన మోడీ ప్రధాని అయ్యారన్నారు. అటువంటిది తననే నమ్మించి మోసం చేశారన్నారు. తాను ఓపిక పట్టింది రాష్ట్ర ప్రజల కోసమేనన్నారు. ప్రత్యేక హోదా ఏపీకి ఇవ్వకుండా 11 రాష్ట్రాలకు ఇచ్చి, ఏపీని మాత్రం స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోమని సలహా ఇస్తారన్నారు. ఆ రాష్ట్రాలకు ఇచ్చి ఏపీకి ఎందుకివ్వరని నిలదీస్తే సమాధానం చెప్పే పరిస్థితి లేదన్నారు. పోలవరం ప్రాజెక్టులో మూడు వేల కోట్ల అదనంగా ఖర్చు పెడతే అది కూడా కేంద్రం ఇవ్వడం లేదన్నారు. కేంద్రం రాజధానికి ఇచ్చింది 1500 కోట్లేనని, ఇప్పుడు మాత్రం తాము డబ్బులిచ్చినా కట్టలేదని బీజేపీ ఎదురుదాడి చేస్తుందన్నారు. పటేల్ విగ్రహానికి 2500 కోట్లు ఖర్చు పెట్టిన కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి మాత్రం నిధులు ఇవ్వనంటుందన్నారు.
వైసీపీతో లాలూచీ రాజకీయాలు.....
రాష్ట్రాభివృద్ధి కోసమే తాను సంయమనం పాటించాలన్నారు. అవినీతి వైఎస్సార్ కాంగ్రెస్ తో లాలూచీ పడి ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారన్నారు. తానైతే వారి మాట విననని వైసీపీతో జత కట్టారన్నారు. రాష్ట్రపతి ఎన్నికల నుంచి వైసీపీతో లాలూచీ ప్రారంభమయిందన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని అరుణ్ జైట్లీ చెప్పిన రోజునే కేంద్రమంత్రి వర్గం నుంచి వైదొలిగామని చెప్పారు. బాధ్యతగల నాయకుడిగా మోడీకి ఫోన్ చేసి మంత్రివర్గం నుంచి తప్పుకుంటున్నామని చెప్పానన్నారు. మళ్లీ వారికి అవకాశమిచ్చానని, ఎన్డీఏలో ఉన్నామని, ఏపీ సమస్యలను పరిష్కరించమని మోడీని కోరానన్నారు. కాని మోడీ ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. పార్లమెంటులో అవిశ్వాసం పెట్టినా చర్చకు రాకుండా చేశారన్నారు. ఎక్కడా తాను రాజీ పడలేదన్నారు. విలువలకు తిలోదకాలివ్వలేదన్నారు. తన విశ్వసనీయతే తనను కాపాడుతుంద్నారు. సరైన సమయంలోనే సరైన నిర్ణయం తీసుకున్నానని చంద్రబాబు చెప్పారు. నాలుగేళ్ల ముందు ఈ పనిచేసి ఉంటే సమయమంతా పోరాటానికే సరిపోయి ఉండేదన్నారు. అయినా హోదా కోసం పోరు ఆగదని చంద్రబాబు తేల్చి చెప్పారు. కేంద్రం మెడలు వంచైనా అనుకున్న లక్ష్యానికి చేరుకుంటామని చెప్పారు.
