నాలుగేళ్లలో కేంద్రం విదిల్చిన సాయమెంతంటే..

విభజనతో ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఏపీకి నాలుగేళ్లలో కేంద్రం ఎంత ఇచ్చింది? ఎంత విదిల్చింది? అనే అంశంపై ఇప్పటికీ అధికార వర్గాల్లో చర్చ జరుగుతూనే ఉంది. ఎడతెగని చర్చలు, సమావేశాలు. మేధోమధనాలు జరుగుతున్నాయే తప్ప ఇప్పటికీ ఒక స్పష్టమైన అంకె మాత్రం తేలడం లేదు. కానీ ఈ వివరాలపై ఇప్పటికి ఒక క్లారిటీ వచ్చిందట. అదేంటంటే.. ఇప్పటివరకూ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన సాయం అక్షరాలా రూ.1.86 లక్షల కోట్లు! ఇంత ఇచ్చినా రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదని టీడీపీ నేతలు నిందలేయడం ఏంటా అనుకుంటున్నారా? ఇందులోనే ఉంది అసలు లెక్క. కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఏటా కొన్ని నిధులు ఇస్తుంది.. ఇలా వచ్చినవే రూ.1.86లక్షలు! మరి ఏపీ విభజన చట్టం ప్రకారం నాలుగేళ్లలో కేంద్రం విదిల్చిన మొత్తం.. కేవలం రూ.13,520 కోట్లు!! లక్ష కోట్లు సాయం అందుతుందని అనుకుంటే.. ఇలా అందులో పదోవంతు ఇచ్చి చేతులు దులుపుకున్నారు కేంద్ర పెద్దలు!
కనీసం 40 వేల కోట్లు రావాలి...
హోదా లేదా ప్యాకేజీ, ఇతర విభజన హామీల కింద ప్రత్యేకంగా కేంద్రం నుంచి అందాల్సిన, అందుతుందని రాష్ట్రం ఆశించిన సాయం లక్ష కోట్లు. ఇప్పటికి నాలుగేళ్లు గడిచిపోయాయి. అంటే.. దామాషా ప్రకారం కనీసం రూ.80 వేల కోట్లు రాష్ట్రానికి సహాయంగా అంది ఉండాలి. పోనీ.. ఈ హామీలను ఐదేళ్లలో కాదు, పదేళ్లలో అమలు చేస్తారనుకుంటే ఈ నాలుగేళ్లకు 40వేల కోట్లు వచ్చి ఉండాలి. కానీ కేంద్రం నవ్యాంధ్రకు ప్రత్యేకంగా చేసిన సహాయం కేవలం 13,520 కోట్లు! నవ్యాంధ్రకు ఈ నాలుగేళ్లలో కేంద్రం నుంచి రూ.1.86 లక్షల కోట్లు రావడం నిజమే. కానీ ఇందులో విభజన హామీల నేపథ్యంలో ప్రత్యేకంగా అందిన సహాయం రూ.13,520 కోట్లు మాత్రమే. మిగిలిన 1.74 లక్షల కోట్లు నిబంధనల ప్రకారం అన్ని రాష్ట్రాలకు వచ్చినట్లుగానే నవ్యాంధ్రకూ దక్కాయి.
గిమ్మిక్కులతో నిధుల్లో కోతలు...
2014 జూన్ 2న రాష్ట్ర విభజన అమలులోకి వచ్చింది. ఆ ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు ఉన్న 10 నెలల సమయంలో ఏర్పడిన రెవెన్యూ లోటు రూ.16,000 కోట్లను కేంద్రమే భర్తీ చేయాలి. కానీ రకరకాల గిమ్మిక్కులతో చేసి లోటు లెక్కలకు భారీగా కోత విధించారు. ఇప్పటికి ఈ పద్దు కింద రూ.3980 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇక అమరావతి నిర్మాణానికి రూ.3,500 కోట్లు ఇవ్వాలని విభజన చట్టంలో పేర్కొన్నారు. కేంద్రం రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చింది. విజయవాడ, గుంటూరులో భూగర్భ డ్రైనేజీ కోసం ఇచ్చిన వెయ్యి కోట్లను కూడా కలిపి రాజధానికి రూ.2500 కోట్లు ఇచ్చామని చెప్పుకొంటోంది. ఈ నాలుగేళ్లలో వెనుకబడిన జిల్లాలకు రూ.1400 కోట్లు రావాలి. కానీ రూ.1050 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 9న రూ.350 కోట్లు ఇచ్చినట్లే ఇచ్చి.. ప్రధాని కార్యాలయం అనుమతి లేదంటూ ఫిబ్రవరి 15వ తేదీన మొత్తం వెనక్కి తీసేసుకున్నారు.
ఒప్పందం కుదరకుండా అడ్డుపుల్లలు..?
జాతీయ ప్రాజెక్టుగా చేపట్టిన పోలవరంపై రాష్ట్రం చేసిన ఖర్చులో రూ.5350 కోట్లను కేంద్రం తిరిగి ఇచ్చింది. ఈ పద్దు కింద ఇంకా రూ.2 వేల కోట్లకుపైగా రావాలి. పోలవరం ప్రాజెక్టుకు నిధులిచ్చేందుకు నాబార్డుతో రాష్ట్రం అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంది. కానీ, ఈ ఒప్పందం కుదరకుండా కేంద్రం ఎప్పటికప్పుడు అడ్డుపుల్లలు వేస్తోంది. జాతీయ స్థాయి విద్యాసంస్థలకు రూ.420 కోట్లు ఇచ్చారు. ఇదే విధంగా నిధులు ఇస్తే ఆయా సంస్థల నిర్మాణం పూర్తి దశాబ్దం దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కేంద్రం నుంచి ఇతర నిధుల కింద రూ.120 కోట్లు కేంద్రం నుంచి వచ్చాయి. ఇవన్నీ కలిపితే... రాష్ట్రానికి ఈ నాలుగేళ్లలో అందిన ప్రత్యేక సహాయం రూ.13,520 కోట్లు మాత్రమే. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం ఢీ కొడుతున్న సమయంలో కేంద్రం నుంచి ప్రత్యేక సాయం కింద ఒక్కపైసా కూడా వచ్చే అవకాశం లేనట్లేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

