Sat Dec 07 2024 23:11:25 GMT+0000 (Coordinated Universal Time)
యుద్ధం ముగిసిపోలేదా?
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి గవర్నర్ ప్రసంగం ఎలా ఉండనుందన్నది ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అయితే తమిళనాడు సీన్ రిపీట్ అవుతుందా? అన్న అనుమానాలున్నాయి. ప్రస్తుతానికి రాజ్భవన్, ప్రగతి భవన్ల మధ్య సయోధ్య కుదిరినట్లే పైకి కనిపిస్తుంది. గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ బడ్జెట్ ఫైల్స్ పై సంతకాలు చేశారు. మంత్రులు, ఉన్నతాధికారులు రాజ్భవన్ కు వెళ్లి బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించాల్సిందిగా కోరారు. దీంతో గవర్నర్ ఈ నెల 3న ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారన్నది స్పష్టమయిపోయింది.
తమిళనాడు తరహాలో...
అయితే ఇక్కడ తమిళనాడు తరహాలో జరుగుతుందా? లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులోనూ ప్రభుత్వం ఇచ్చిన స్క్రిప్ట్ కాకుండా అక్కడి గవర్నర్ రవి తన స్క్రిప్ట్ చదవడంతో అధికార పక్షమే సమావేశాలను బహిష్కరించాల్సి వచ్చింది. తమిళి సై సౌందర్ రాజన్ కూడా తమిళనాడు నుంచి వచ్చిన వ్యక్తే. అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉండి తర్వాత తెలంగాణ గవర్నర్ గా నియమితులయ్యారు. తమిళనాడులో జరిగినట్లుగానే ఇక్కడ కూడా తమిళి సై తన సొంత స్క్రిప్ట్ ను ఉభయ సభల ముందు ఉంచుతారా? అన్న అనుమానం అధికార పార్టీని పట్టిపీడిస్తుంది.
ఏ స్క్రిప్ట్ చదువుతారు?
కానీ అధికార పార్టీ ఏం చేయలేని పరిస్థితి. సంప్రదాయంగా అయితే ప్రభుత్వం స్క్రిప్ట్ నే గవర్నర్ చదవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో తాము అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు కేంద్ర ప్రభుత్వంపై కూడా విమర్శలు స్క్రిప్ట్ లో ఉంటే గవర్నర్ వాటిని చదువుతారా? కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని పెట్టిన తర్వాత కేంద్రంతో యుద్ధమే చేస్తున్నారు. తమకు రావాల్సిన నిధుల విషయంలో అన్యాయం జరుగుతుందని బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు. అలాంటిది గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు లేకుండా సాగుతుందా? అంటే చెప్పలేని పరిస్థితి.
ఏం చేయాలి?
ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా ఒకింత టెన్షన్ గా సాగే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల రిపబ్లిక్ దినోత్సవం వేడుకల్లోనే తమిళి సై సౌందర్ రాజన్ రాష్ట్ర ప్రభుత్వంపైనా, అధికార పార్టీపైన విమర్శలు చేశారు. ఆమె సొంతంగా స్క్రిప్ట్ తెచ్చుకుని చదివితే ఏం చేయాలి? అన్న దానిపై కూడా గులాబీ పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. తమిళనాడు తరహాలోనే తాము కూడా గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించాలా? లేకుంటే మరో మార్గం ఏదైనా ఉందా? అన్న పనిలో పడ్డారు సీనియర్ నేతలు. దీనికి సంబంధించి పార్టీలో లోతుగానే చర్చ జరుగుతున్నట్లు తెలిసింది. గవర్నర్, గవర్న్మెంట్ మధ్య యుద్ధం ముగిసిపోయిందా? లేదా? అన్నది బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజునే తేలిపోనుంది.
Next Story