Sat Sep 14 2024 23:29:48 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : వైసీపీ మరో బీఆర్ఎస్ గా మారనుందా? కోలుకుంటుందా?
తెలంగాణలో బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్ లో వైసీపీలు కష్టకాలంలో ఉన్నాయి. రెండు పార్టీల పరిస్థితి ఒకే రీతిలో ఉంది.
ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత ఏ పార్టీకి అయినా ఉథ్థానపతనాలు తప్పవు. కానీ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం మీద నేతలు, క్యాడర్ పార్టీనే అంటిపెట్టుకుని ఉంటాయి. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. రెండు ప్రాంతీయ పార్టీలే. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్, ఇటు ఏపీ రాజకీయాల్లో సోనియా గాంధీని ఎదిరించిన లీడర్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనాల్లో ఒక్కసారిగా ఇమేజ్ పెరిగింది. కేసీఆర్ 2014లో తెలంగాణలో అధికారంలోకి రాగా, జగన్ 2019 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు. ఇద్దరికి సన్నిహిత సంబంధాలున్నాయి.
ఓటమి పాలు కాగానే..
అలాంటిది 2023 లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలయింది. అయితే మరీ దారుణంగా అయితే మాత్రం ఓడిపోలేదు. పదేళ్లు అధికారంలో ఉండటంతో సహజంగా రేగిన అసంతృప్తి ఓటమికి గల కారణాలుగా చెప్పాలి. దీంతో పాటు అనేక రీజన్స్ బీఆర్ఎస్ ఓటమి పాలవ్వడానికి ఉన్నాయంటారు. అయితే బీఆర్ఎస్ ఓడిన వెంటనే కేసీఆర్ చేరదీసిన వారే ఆయనను వదిలేసి వెళ్లారు. పట్నం మహేందర్ రెడ్డి, దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇలా అనేక మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వదిలి వెళ్లిపోయారు. పది మంది మంది ఎమ్మెల్యేలు, ఆరుగురి వరకూ ఎమ్మెల్సీల వరకూ బీఆర్ఎస్ ను వీడివెళ్లిపోయారు.
సన్నిహితులైన వారు...
2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ఐదేళ్లు మాత్రమే పవర్ రుచి చూడగలిగారు. 2023 ఎన్నికల్లో దారుణ ఓటమి పాలయ్యారు. కేవలం పదకొండు స్థానాలకే పరిమితమయ్యారు. ఎన్నికల ఫలితాలు వచ్చి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వంద రోజులు కూడా పూర్తి కాలేదు. జగన్ ఇష్టపడిన వారు, తాను నమ్మిన వారు పార్టీని వదిలేసి వెళ్లిపోతున్నారు. మాజీ మంత్రి ఆళ్ల నాని రాజీనామా చేయడంతో జగన్ కు ఒకరకంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక తాజాగా మోపిదేవి వెంకట రమణ కూడా రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. వీరితో పాటు కిలారు రోశయ్య, మద్దాలి గిరి, పెండెం దొరబాబుతో పాటు ఏలూరు నగర మేయర్ నూర్జహాన్ కూడా పార్టీని వీడి వెళ్లారు.
రానున్న కాలంలో...
ఇంకా రానున్న కాలంలో చాలా మంది లైన్ లో ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం 164 స్థానాలతో బలంగా ఉంది. వైసీపీకి రాజీనామా చేసినా స్థానిక సంస్థల నేతలు తప్ప ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వంటి వారు రాజీనామా చేసినా ప్రయోజనం లేదు. రాజ్యసభ స్థానాలకు మాత్రం కొంత టీడీపీ ప్రయారిటీ ఇచ్చే అవకాశాలున్నాయి. అందుకే తెలంగాణలో ఎదుర్కొంటున్న కష్టకాలాన్నే ఇప్పుడు జగన్ ఎదుర్కొంటున్నారు. ఇద్దరు లీడర్లు బుజ్జగింపు చర్యలకు మాత్రం దిగడం లేదు. 2019 ఎన్నికల్లో గెలిచినప్పుడు అదే టీడీపీ నుంచి వచ్చిన నేతలు ఇప్పుడు తిరిగి సొంత గూటికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు పార్టీల అధినేతలు వీళ్లకా? మనం పదవులిచ్చింది అని ఇప్పుడు బాధపడుతున్నారు. కానీ ప్రయోజనం లేదన్నది వాస్తవం.
Next Story