Fri Mar 27 2026 08:21:26 GMT+0530 (India Standard Time)
ఏపీలో బీజేపీ ఫోకస్ అంతా ఇక దానిపైనేనట
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఫోకస్ ఇకపై అంతా కాపు సామాజికవర్గం ఓట్లపైనే ఉండేలా కన్పిస్తుంది.

కాపులు ఇప్పుడు రాజకీయంగా అందరికీ ఆప్తులుగా మారిపోతున్నారు. ఎన్నికలు దగ్గరపడే సమయంలో అతి పెద్దదైన కాపు సామాజికవర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. నిన్నటి వరకూ పెద్దగా పట్టించుకోని బీజేపీ సయితం కాపు సమస్యలపై గళం విప్పుతుంది. రాష్ట్రంలో బీజేపీ, జనసేన కలసి పనిచేస్తున్నాయి. రెండు పార్టీల మధ్య పొత్తు ఉంది. వచ్చే ఎన్నికల్లోనూ జనసేన, బీజేపీ కలసి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
తమ పార్టనర్....
అయితే పవన్ కల్యాణ్ తొలి నుంచి కాపు సామాజికవర్గం ముద్ర తన మీద పడకుండా ఉండేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. నేరుగా కాపు సమస్యలపై ఆయన గళమెత్తలేకపోతున్నారు. దీంతో బీజేపీ ఈ టాస్క్ తీసుకున్నట్లు కనపడుతుంది. కాపు లకు ఐదు శాతం రిజర్వేషన్లను విద్య, ఉద్యోగ రంగాల్లో కల్పించాలంటూ డిమాండ్ ను మొదలు పెట్టింది. గత ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన ఈబీసీ రిజర్వేషన్లలో ఐదు శాతాన్ని కాపులకు కేటాయించింది. ఇందుకోసం డెడ్ లైన్ పెట్టింది. మార్చి 15వ తేదీ లోగా రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతుంది.
రిజర్వేషన్ల కోసం....
అయితే జగన్ వచ్చిన తర్వాత దానిని అమలు చేయడం లేదు. ఇప్పుడు బీజేపీ కాపు రిజర్వేషన్లు అమలు చేయాలని గట్టిగా కోరుతుంది. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇచ్చిన టీడీపీ మాత్రం పెద్దగా నోరు మెదపడం లేదు. బీసీ ఓటు బ్యాంకు దెబ్బతింటుందన్న ఆందోళనతో దీనిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక అధికారంలో ఉన్న వైసీపీది కూడా అదే పరిస్థితి. దీంతో బీజేపీ కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేసుకుంటుంది. రాజ్యసభలోనూ కాపు రిజర్వేషన్ల అంశాన్ని జీవీఎల్ నరసింహారావు ప్రస్తావించారు.
టీడీపీకి వెళ్లకుండా...
ఏపీలో 28 శాతం కాపు సామాజికవర్గం ఉంది. అంటే రాజకీయంగా బలమైన సామాజికవర్గం. కాపులంతా ఒక్కటైతే రాజ్యాధికారం చేజిక్కించుకోవడం పెద్ద కష్టమేమీకాదు. దీంతో పాటు వచ్చే ఎన్నికల్లో కాపు ఓటు బ్యాంకు టీడీపీకి వెళ్లకుండా ఉండేందుకే బీజేపీ ఈ స్టాండ్ గట్టిగా తీసుకుందన్న టాక్ కూడా వినపడుతుంది. జనసేన అధినేత పవన్ ఎటూ ఈ విషయంలో పెద్దగా మాట్లాడరు కాబట్టి బీజేపీయే పెద్ద గొంతును చేసి రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేస్తుంది. మొత్తం మీద బీజేపీ ఫోకస్ ఇకపై అంతా కాపు సామాజికవర్గం ఓట్లపైనే ఉండేలా కన్పిస్తుంది.
Next Story

