Wed Feb 04 2026 16:10:15 GMT+0000 (Coordinated Universal Time)
ఒకరిపై ఒకరు.. రచ్చ..రచ్చ
బీజేపీ, బీఆర్ఎస్ వాతావరణాన్ని హీటెక్కిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటున్నారు

ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార, విపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం సహజమే. అయితే అది రాజకీయ విమర్శల వరకూ పరిమితమయితే బాగుండు. కానీ ఒక పార్టీ నేతలపై మరొకరు కేసులు పెట్టేంత స్థాయికి వెళ్లిపోవడం పాలిటిక్స్ పీక్కు చేరుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుమార్తె కవితను కేసులో ఇరికించే ప్రయత్నం చేయగా, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం బండి సంజయ్‌ను టార్గెట్ చేసి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ఏ1 నిందితుడిగా పేర్కొనడం విశేషం.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో...
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకుంటూ పాలిటిక్స్‌ను రచ్చ కీడిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో కల్వకుంట్ల కవితను ఈడీ మూడు సార్లు ప్రశ్నించింది. మూడు సార్లు పార్టీ నేతలను కేంద్ర ప్రభుత్వం టెన్షన్ పెట్టింది. కవితను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం మూడు రోజుల పాటు సాగింది. మంత్రులంతా ఢిల్లీకి చేరుకుని కవితకు అండగా నిలబడేందుకు ప్రయత్నించారు. రాజకీయ దురుద్దేశంతో కూడిన కేసు అంటూ బీఆర్ఎస్ నేతలు బీజేపీపై విరుచుకుపడ్డారు. కవితకు ఆ స్కాంతో సంబంధం లేకపోయినా కావాలని కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.
ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో...
దీనికి ప్రతిగా ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ఏ1 నిందితుడిగా చేర్చారు. ప్రశ్నాపత్రం బయటకు వచ్చిన తర్వాత రెండు గంటలకు సంజయ్‌కు చేరిందని పోలీసులు చెబుతున్నారు. సంజయ్ ఫోన్ నుంచి అనేక మందికి ఈ ప్రశ్నాపత్రం వెల్లడయిందని అంటున్నారు. ఈ కేసులో ప్రధాన నిందతుడు ప్రశాంత్, బండి సంజయ్‌లకు మధ్య జరిగిన ఛాటింగ్ కూడా ఇందుకు నిదర్శనమని తెలిపారు. బండి సంజయ్‌ను అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. దీనిని బీజేపీ నేతలు రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నారు. అసలు బండి సంజయ్‌కు పదోతరగతి ప్రశ్నాపత్రం లీకు చేయాల్సిన అవసరం ఏంటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అర్ధరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని కమలనాధులు నిలదీస్తున్నారు.
ఒకరిపై ఒకరు...
ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలు కూడా సంజయ్ అరెస్ట్ ఘటనపై ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ కల్వకుంట్ల కవితపై ఈడీ కేసు నమోదు చేయగా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ బండి సంజయ్‌పై కేసు నమోదు చేసింది. రెండు పార్టీలు ప్రజల్లో వైరి పక్షాన్ని పలచన చేయడానికే కేసులు పెట్టే పనిలో ఉన్నాయన్న విమర్శలు వినపడుతున్నాయి. యువతలో తమకు వ్యతిరేకత ఉందని ప్రశ్నాపత్రం లీకేజీ కేసును సంజయ్ మెడకు చుట్టారంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తుండగా, ప్రభుత్వాన్ని బద్నాం చేసి రాజకీయ లబ్ది పొందడానికి బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండి పడుతున్నారు. ఎన్నికల ఏడాది రెండు పార్టీలు వీధిన పడ్డాయని చెబుతున్నారు. ప్రజలను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నాలే తప్ప మరొకటి కాదన్న విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి.
Next Story
