నయీమ్ అనే నేను……

2 గోనె సంచుల నిండా బంగారం..ఏకే47, సెనైడ్ గన్, 30 విగ్గులు, 5 మేకప్ కిట్లు, 1000 జతల బట్టలు, వందల డాక్యుమెంట్లు, ప్రామిసరీ నోట్లు, ఒక శాటిలైట్ ఫోన్ వంటి పరికరాలతో నయీం అనే నర హంతకుడి పడక గది సోదాల దృశ్యాలుగా మీడియా లో అనేక కథనాలు వచ్చాయి. నయీం అక్రమంగా, బెదిరించి సంపాదించిన ఆస్థులు తవ్వే కొద్ది బయటపడ్డాయి. అప్పటికే వేల కోట్లు బయటపడగా.. ఇంకా బయటకు రాని లెక్కలు చాలానే ఉన్నట్లు వార్తా కథనాలు వెలువడ్డాయి. ఆ వందలు, వేల కోట్ల డబ్బు, ఇతర సంపద ఏమైందో ఎవరికీ తెలియదు. మాజీ నక్సలైటు, పోలీసు మిత్రుడు నయీమ్ తో అవినాభావ సంబంధాలు కలిగినట్టు రుజువులు లభించిన కొందరు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. అయితే, ఇప్పుడు వారి సస్పెన్షన్ ను ఎత్తివేయడానికి ప్రభుత్వం దాదాపు నిర్ణయించింది. అధికారికంగా ఒకటీ, రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
ఐదుగురు అధికారులపై చర్యలు...
నరహంతకుడు నయీంకు సహకరించిన అభియోగాలతో సస్పెన్షన్ కు గురైన అప్పటి సిఐడి అదనపు ఎస్పీ మద్దిపాటి శ్రీనివాసరావు, సిసిఎస్ ఎసీపీ చింతమనేని శ్రీనివాస్, మీర్‌చౌక్ ఎసీపీ మలినేని శ్రీనివాసరావు, సంగారెడ్డి సిఐ మస్తాన్ వలి, కొత్తగూడెం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజగోపాల్‌లకు ఊరట లభించనున్నది. ఈ సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఒకటీ, రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నాయి. నయీంతో సన్నిహితంగా ఉన్నట్లు ఫోటోలు వెలుగు చూడడం, ఇతర ఆధారాల వల్ల ఈ ఐదుగురిపై సర్కారు ‘వేటు’ వేసింది. దీంతో పాటు నయీంతో సంబంధాలున్నట్లు ఆరోపణలు వచ్చిన మరో 20 మందికి గతంలో తాఖీదులు జారీ చేశారు.
రాజకీయ నేతలపైనా..
గ్యాంగ్ స్టర్ నయీం కేసులో తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ స్టేట్ మెంట్ ను ‘సిట్’ అధికారులు నమోదు చేశారు. భువనగిరి వ్యాపారి నాగేందర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిట్ విచారణ చేపట్టింది. నయీంతో తనకెలాంటి సంబంధం లేదని నేతి చెప్పినట్టు సమాచారం. అయితే నయీంతో ఆయన వ్యాపార లావాదేవీలు నిర్వహించినట్టు సిట్ దగ్గర ఆధారాలు ఉన్నట్టు వార్తా కథనాలు అప్పట్లో వెలువడ్డాయి. నయీం భార్య ఫర్హానాతో కలిసి విద్యాసాగర్ భూమి కొన్నట్టు ‘సిట్’ అధికారులు సాక్ష్యాలు సేకరించినట్టు కూడా పత్రికలు వార్తలు ప్రచురించాయి. కానీ, ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కేవలం ఎఫ్ఐఆర్ నమోదు చేసి వదిలేశారు. తర్వాత ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు.
కేసు కంచికేనా..?
ఉమ్మడి ఎపిలో దశాబ్దన్నర కాలం పాటు మాఫియా సామ్రాజ్యం నిర్వహించి 2016 ఆగస్టు 8న పోలీసు ఎన్కౌంటర్లో హతమైన నయీం కేసు విచారణ అటకెక్కినట్లుగా కనిపిస్తోంది. ఈ కేసు విచారణ మూడు నెలల్లో ముగిస్తామని ప్రకటించిన పోలీసు ఉన్నతాధికారులు రెండేళ్లుగా ఎటూ తేల్చడం లేదు. నయీం కేసులో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న బడా నేతలు, బ్యూరోక్రాట్లు పోలీసు శాఖపై, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మెత్తపడేలా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాఫియా కార్యకలాపాలు నిర్వహించి వ్యాపార వర్గాలతో పాటు రాజకీయ వర్గాలను హడలెత్తించి వందల కోట్ల రూపాయలను సంపాదించి, సొంతంగా ప్రైవేటు సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకుని పలుచోట్ల చాలా కాలం పాటు సమాంతర ప్రభుత్వాన్ని కూడా నడిపిన గ్యాంగ్‌స్టర్ నయీం వ్యవహారంపై పోలీసుల విచారణ పై మొదటినుంచీ అనుమానాలున్నాయి.
వేలాది ఎకరాలు...కోట్లాది రూపాయలు...
నక్సలైట్‌గా జీవితం ప్రారంభించి ఆ తరువాత పోలీసు ఇన్ఫార్మర్గా మారి పోలీసులతో చేతులు కలిపిన నయీం అనంతర కాలంలో మాఫియా డాన్‌గా ఎదగడం తెలిసిందే. ఇదే సమయంలో హంతక ముఠాలను ఏర్పాటు చేసుకుని అనేక హత్యలు చేయడంతో పాటు అంతకు మించిన అరాచకాలకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో వేలాది ఎకరాల భూములను ఆక్రమించి వందల కోట్ల రూపాయలను సంపాదించడంతో పాటు అడ్డువచ్చిన వారిని నయీమ్ అతి కిరాతకంగా హత్యచేశాడు. తన సెటిల్మెంట్ల కోసం రంగారెడ్డి, నల్లగొండ పరిధుల్లో ఓఆర్ఆర్కు సమీపంలో గల ఓ గ్రామంలో రహస్య స్థావరం ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు సా గించేవాడు. తన వద్దకు సెటిల్మెంట్లకు వచ్చే వారిని ఎదురుగా ఎకె 47 మొదలుకొని పదుల సంఖ్యలో తుపాకులు, గొడ్డళ్లు, వేట కొడవళ్లు, బాంబులు, ఆరడుగులకు పై బడి మంచి శరీర సౌష్టవంతో ఉన్న పహిల్వాన్లను వుంచే వాడు. దీంతో సెటిల్మెంట్ల కోసం వచ్చే వారు ఈ దృశ్యాలను చూడగానే బెదిరిపోయి నయీం చెప్పినట్లు మసులుకుని అతడు ఎంత చెబితే అంత అన్నట్లు అంగీకరించే వారు.
పెద్దలపై చర్యలేవి..?
పసి బాలలపై అతని వికృత లైంగిక చర్యలు, వారి కిరాతక హత్యలు మరింత సంచలనం రేపాయి. నయీం ఎన్కౌంటర్ తరువాత చోటు చేసుకున్న అనేక పరిణామాలు అనేక మలుపులు తిరగడంతో పాటు రాజకీయ, పోలీసు వర్గాలకు ఇందులో ప్రమేయం ఉన్నట్లు వార్తలు రావడం తీవ్ర ప్రకంపనలు రేపాయి. నయీంతో అంటకాగినట్లు సీనియర్ ఐపిఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులతో పాటు రాజకీయ నేతలపై ఆరోపణలు వచ్చాయి. ఇందులో కేవలం శాసనమండలి ఛైర్మన్ నేతి విద్యాసాగర్‌పైన మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదైనా తదుపరి చర్యలు తీసుకోలేదు. విద్యాసాగర్‌ను సిట్ అధికారులు విచారించారని వార్తలను ఆయన ఖండించారు. ముగ్గురు ఎమ్మెల్యేలు, మరో ముగ్గురు ఎమ్మెల్సీలతో పాటు మరికొందరు ప్రజా ప్రతినిధులు, కొందరు పోలీసు అధికారులు నయీంకు సహకరించినట్లు సిట్ ఆధారాలు సేకరించినా దీని పై ఎలాంటి ముందడుగు పడలేదు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌పై కేసు నమోదు చేసేందుకు ‘ సిట్’ చివరి నిమిషంలో వెనుకంజ వేసింది. మొత్తం మీద నయీం కేసును విచారించిన సిట్ అధికారులు 227 కేసులు నమోదు చేశారు. ఇదే సమయంలో 128 మందిని అరెస్టు చేయడంతో పాటు 109 మందిని కస్టడీలోకి తీసుకుని విచారించారు. 895 మంది సాక్షులను విచారించారు. నయీంకు సహకరించిన 14 మంది కరుడుగట్టిన నేరగాళ్లపై పి.డి యాక్టు అమలు చేసి జైలుకు పంపారు. నయీం ముఠాలో పనిచేసిన వారు, నయీం కుటుంబసభ్యుల పైనే ఈ చర్యలు తీసుకున్నారు. కానీ, అసలు నయీం వెనకాల ఉండి, అతడి వల్ల లబ్ధి పొందిన పెద్దలు, అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో కేసు నీరుగారి పోయింది.

