కమలం ఇమేజ్ భారీగా డామేజ్ అయిందే...!

వచ్చే ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదా? మిత్రులంతా దూరమవుతున్న వేళ ఆ పార్టీ ఇమేజ్ క్రమంగా తగ్గిపోతుందా? అంటే అవుననే చెబుతోంది ఈ సర్వే. ఇటీవల బీజేపీ ఒక అంతర్గత సర్వే చేయించుకుంది. తాము సొంతంగా చేయించుకున్న ఈ సర్వేలో కమలనాధులకు దిమ్మ తిరిగిపోయే ఫలితాలు కన్పించాయి. వచ్చే ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ కాదు కదా? 132 స్థానాలు దక్కే అవకాశం ఉందని తాజా సర్వే తేల్చింది. దీంతో కమలనాధులు ఆలోచనలో పడ్డారు. గతకొంతకాలంగా ఉప ఎన్నికల్లో ఓటమి పాలవుతున్న కమలనాధులకు ఎక్కడ తప్పు జరుగుతుందో అంతుపట్టడం లేదు.
152 స్థానాల్లో.....
దీంతో ఆ పార్టీ అంతర్గత సర్వే చేయించుకుందని ప్రముఖ హిందీ దినపత్రిక ఒక కథనాన్ని ప్రచురించడం విశేషం. అయితే ఈ సర్వేలో 2014 ఎన్నికల్లో గెలిచిన 282 స్థానాల్లో దాదాపు 152 స్థానాల్లో విజయావకాశాలు తక్కువగా ఉన్నాయని సర్వేలో తేలింది. ఇక మిగిలిన 132 స్థానాల్లో కూడా విజయం కోసం శ్రమించాల్సి ఉంటుందని సర్వేలో తేలింది. దీంతో కమలనాధులు కంగుతిన్నారు. ఒకవైపు మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా బయటకు వెళుతుండటం, సర్వే ఫలితాలు తమకు వ్యతిరేకంగా రావడంతో ప్రధాని మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలు రంగంలోకి దిగనున్నట్లు ఆ కథనంలో పేర్కొన్నారు.
యూపీలో భారీగా కోత.....
ముఖ్యంగా గత ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో బీజేపీ 71 స్థానాలను గెలుకుంది. కాని ఇప్పుడు ఎన్నికలు జరిగితే యూపీలో 23 స్థానాలకు మించి రావని తేలడంతో అతి పెద్ద రాష్ట్రంలో గండి పడుతుందన్న ఆందోళన అమిత్ షాలో బయలుదేరింది. ఈ సర్వేలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందని తేలడంతో ఈ ఏడాదిలో నష్ట నివారణ చర్యలను చేపట్టాలని కమలనాధులు భావిస్తున్నారు. ఉత్తర భారతంలోనే బీజేపీ సిట్టింగ్ సీట్లకు గండిపడుతున్నాయని తేలడంతో ఆందోళన చెందని కమలనాధులు ఇతర రాష్ట్రాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లో మెజారిటీ సాధించాలని భావిస్తున్నారు. మొత్తం మీద కమలనాధుల అంతర్గత సర్వే వారిని కంగు తినింపించేలా చేసింది.
