ఎపి టార్గెట్ గా బిజెపి బ్లూ ప్రింట్ రెడీ

అమిత్ షా పై టిడిపి శ్రేణుల దాడి ఫలితమో, ప్రధాని మోడీ పై సాగిస్తున్న విమర్శల ప్రభావమో కానీ ఎపి రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు కమలనాధులు పక్కా స్కెచ్ తో బ్లూ ప్రింట్ సిద్ధం చేశారని హస్తిన వర్గాల టాక్. కర్ణాటక ఎన్నికల వరకు ఉగ్గబట్టుకుని కూర్చున్న కమలం ఎపి రాజకీయాలపై ఇక గేమ్ ప్లాన్ స్టార్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసేసింది. అందుకోసమే ఢిల్లీ లో వివిధ కీలక అంశాలను ఎపి బిజెపి నూతన అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కు నిర్దేశించింది బిజెపి. ఆ వ్యూహాన్ని పక్కాగా అమలు చేయాలని ఆదేశించింది. ఏమి చేయాలో ఎలా చేయాలో పూర్తిగా దిశా దశా నిర్దేశం చేశారు షా. ఇక వ్యూహాత్మకంగా కాషాయదళం అడుగులు ఎపిమొత్తం విస్తరించడానికి సిద్ధం అయ్యాయి.
రంగంలోకి రాంమాధవ్ ...
బిజెపి ఎపి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న రామ్ మాధవ్ రంగంలోకి దిగిపోయారు. మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కిన చందంగా టిడిపి రాజకీయాలు చేయడాన్ని ఆయన ప్రశ్నించారు. ఇప్పటినుంచి తమ రాజకీయాలు ఎలా వుంటాయో చూపిస్తాం అంటూ సవాల్ విసిరారు. బాబును తాము విమర్శించకపోయినా ఆయన ప్రధానిపై చేస్తున్న విమర్శల దాడిని బిజెపి తిప్పికొడుతుందన్నారు. కన్నా సారధ్యంలో బిజెపి ప్రజలకు చేరువ అవుతుందన్నారు రామ్ మాధవ్. ఇందుకు సంబంధించి యాక్షన్ ప్లాన్ సిద్ధమైందంటున్నారు ఆయన. ఇదిలా ఉండగా బిజెపి జాతీయ అధ్యక్షుడికి ఏపీలో పార్టీ అభివృద్ధిపై ఒక ప్రజెంటేషన్ అందజేశారు కన్నా. పార్టీలో అసంతృప్హి జ్వాలలు చల్లారిపోతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కులాలు మతాలు, వర్గాలకు దూరంగా బాధ్యతలు నిర్వర్తిస్తా అన్నారు.
