Fri Dec 05 2025 13:36:36 GMT+0000 (Coordinated Universal Time)
Banakacherla Project : అల్పానందమే... ఎదురుదెబ్బ కాదు... ఎన్నికల తర్వాత తిరిగి అనుమతులు?
బనకచర్ల ప్రాజెక్టుకు బ్రేకులు పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కేంద్రం తిరస్కరించింది

బనకచర్ల ప్రాజెక్టుకు బ్రేకులు పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కేంద్రం తిరస్కరించింది. బనకచర్లకు అనుమతి ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. బనకచర్లకు పర్యావరణ అనుమతులు తిరస్కరించిన కేంద్రం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సర్కార్ పంపిన ప్రతిపాదనలను వెనక్కు తిప్పి పంపింది. అయితే ఇది తాత్కాలిక బ్రేకులా? లేక శాశ్వతంగా అనుమతులు ఇవ్వరా? అన్నది తేలాల్సి ఉంది. కానీ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యానే బనకచర్లకు అనుమతులు ఇవ్వకోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. అందుకే ఏపీ ప్రభుత్వానికి చెందిన నేతలు మాత్రం ఇది తాత్కాలిక బ్రేకులేనని, ఖచ్చితంగా బనకచర్ల ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెబుతున్నారు.
గేమ్ ఛేంజర్ గా భావించి...
బనకచర్ల ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనిని గేమ్ ఛేంజర్ గా చంద్రబాబు అభివర్ణించారు. గోదావరిలో వృధాగా తరలిపోయే నీటిని పోలవరం ప్రాజెక్టు ద్వారా కాల్వల ద్వారా రాయలసీమతో పాటు కోస్తాంధ్రలోని అన్ని జిల్లాలకు మళ్లించాలన్నది చంద్రబాబు ఆలోచన. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ రతనాల సీమగా మారుతుందని చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతున్నారు. పోలవరం - బనకచర్ల లింక్ ప్రాజెక్టు కోసం ఎనభైవేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశార. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీ, టీడీపీ కలసి ఉండటంతో సులువుగా అనుమతులు సాధించవచ్చని భావించి ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ ను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు.
రాజకీయంగా అగ్గి రాజుకోవడంతో...
అయితే బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణలో రాజకీయంగా అగ్గి రాజుకుంది. తమకు న్యాయంగా దక్కాల్సిన గోదావరి నీటిని అక్రమంగా ఏపీ ప్రభుత్వం తరలించుకుపోతుందని తెలంగాణలోని అన్ని పార్టీలు ఆందోళనకు దిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలసి వచ్చారు. మరొకవైపు తెలంగాణ బీజేపీ నేతలు కూడా పార్టీ నాయకత్వంపై వత్తిడి తెచ్చారు. బనకచర్లకు అనుమతులు మంజూరు చేస్తే ఆ ప్రభావం తెలంగాణ రాజకీయాల్లో పడే అవకాశముందని పార్టీ పెద్దలకు నచ్చచెప్పడంలో సక్సెస్ అయ్యారు. అందుకే పర్యావరణ అనుమతులు ఇవ్వలేమంటూ కేంద్ర, అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిధిలోని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది.
అభ్యంతరాలు వ్యక్తం కావడంతో...
తెలంగాణ నుంచి అనేక అభ్యంతరాలు ప్రాజెక్టుపై వ్యక్తమయ్యాయి. నీటి కేటాయింపులకు విరుద్ధమంటూ ఢిల్లీ స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ గళమెత్తారు. వరద జలాలపై సమగ్ర అధ్యయనం చేయాలంటూ డిమాండ్ చేశారు. అందుకే ముందుగా అంతరాష్ట్ర అనుమతులు ప్రాజెక్టుకు పొందాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ స్పష్టం చేసింది. దీంతో పాటు ఇప్పుడున్న పరిస్థితుల్లో నిధుల కేటాయింపు కూడా కష్టసాధ్యమవుతుందని భావించిన కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు పూర్తయి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే దీనిపై పునరాలోచించే వీలుందని హస్తిన వర్గాలు చెబుతున్నాయి. బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతిస్తే తెలంగాణలో రాజకీయంగా ఎదురుదెబ్బ తగులుతుందని భావించి బ్రేకులు వేసిందన్నది వాస్తవం.
Next Story

