బాలయ్య ఇలా మారిపోయారే ...?

తొడ కొట్టడం మీసం మెలేయడం నందమూరి వంశానికి అలవాటే. కానీ ప్రధాని స్థాయి వ్యక్తిని పట్టుకుని థర్డ్ జెండర్ అంటూ సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యానించి తప్పులో కాలేశారు. విజయవాడ ధర్మపోరాట దీక్షలో చంద్రబాబు చేసిన దీక్ష కవరేజ్ పక్కకు పోయి బాలయ్య పై చర్చ మొదలయ్యేలా ఆయన మాటల తూటాలు సంచలనం సృష్ట్టించాయి. దాంతో భగ్గుమన్న బిజెపి శ్రేణులు బాలయ్య ఇంటిపై భాగ్యనగరంలో దాడికి తెగబడటం జరిగిపోయింది. దానిపై బాలకృష్ణ వివరణ సైతం ఇచ్చుకోవాలిసి వచ్చింది. తాను మాట్లాడిన మాటలు పార్టీకన్నా వ్యక్తిగతంగా బాలయ్యకు డామేజ్ తెచ్చిపెట్టాయి. బాలయ్య తండ్రి ఎన్టీఆర్ ను ప్రధాని మోడీ చాలా గౌరవ భావంతో సంబోధిస్తారు. ఆయన తనయుడు రివర్స్ లో అగౌరవ పరిస్తే బిజెపి శ్రేణులు రెచ్చిపోక ఏమి చేస్తాయనేది పబ్లిక్ టాక్.
తిరుపతి ధర్మపోరాటంలో బాలయ్య ...
తిరుపతి ధర్మపోరాట సభలో బాలకృష్ణ జాగ్రత్త పడ్డారు. తన నోరు తెస్తున్న ఇబ్బందులు గ్రహించి కేంద్రం పై విమర్శలను ఆచితూచి చేశారు. బాలయ్య మైక్ దగ్గరకు వచ్చేటప్పటికి టిడిపి శ్రేణులు సైతం ఏమి మాట్లాడతారా అని ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఎలాంటి మసాలాలు లేకుండానే ఆయన ప్రసంగం సాగిపోయింది. రాజకీయాలే కాదు నేతలు వాడే భాష కూడా ఇటీవలి కాలంలో దిగజారిపోతోంది. సమస్యలను ప్రస్తావించడం చేతకాక కొందరు మీడియా లో పదేపదే చూపిస్తారని మరికొందరు నెగిటివ్ ప్రచారం వైపు మొగ్గు చూపుతున్నారు. అది ఇప్పుడు బాలకృష్ణ లాంటివారిపై కూడా పడింది. బావ కళ్ళల్లో ఆనందం చూడాలని అమరావతిలో రెచ్చిపోయిన బాలయ్య తిరుపతి సభలో కొంత పరిణితి ప్రదర్శించడంతో ఆయనకు అభిమానులకు విమర్శలు, ప్రతి విమర్శలు ఎదురు కాలేదు.
