రాందేవ్ యాప్..ఇంత బోగస్సా..?

బీఎస్ఎన్ఎల్ తో జతకట్టి స్వదేశీ సమృద్ధి పేరుతో పతంజలి సిమ్ కార్డులు విడుదల చేసిన బాబా రాందేవ్ ఇప్పుడు మరో ఐడియాతో ముందుకొచ్చారు. దేశ్యవాప్తంగా 20 కోట్ల మంది వినియోగిస్తున్న వాట్సాప్ మెసేజింగ్ యాప్ కి పోటీగా స్వదేశీ యాప్ ను ‘కింబో’ పేరుతో విడుదల చేశారు. ప్రతీ ఉత్పత్తిని మార్కెటింగ్ చేసుకునేందుకు, సులువుగా అమ్ముకునేందుకు రాందేవ్ ఉపయోగించే స్వదేశీ లాజిక్ నే మళ్లీ ఇక్కడా ఉపయోగించారు. వాట్సాప్ మాదిరిగానే కింబో యాప్ లో కూడా ప్రైవేటు చాట్, గ్రూపులు, బ్రాడ్ కాస్టింగ్ గ్రూపుల ఏర్పాటు వంటి అన్ని సౌకర్యాలను కల్పించినట్లు సంస్థ ప్రకటించింది.
మన డేటాకు భద్రత లేదంట..
అయితే, స్వదేశీ పేరుతో కింభో యాప్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకున్న బాబా రాందేవ్ కు మొదటిరోజే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసలు ఈ యాప్ ఒక బోగస్ అని, కాపీ క్యాట్ అని తేల్చిపారేశారు కొందరు నిపుణులు. అంతేకాదు ఈ యాప్ లో మేసేజ్ లు చేయడం ప్రమాదకరమని, బగ్స్ ఉన్నాయని, డాటాకు కూడా భద్రత ఉండదని ఫ్రెంచ్ సెక్యూరిటీ రీసెర్చర్ ఇలియేట్ అండర్సన్ స్పష్టం చేశారు. ఈ యాప్ లో ఇతరుల మేసేజ్ లను తాను యాక్సెస్ చేయగలుగుతున్నానని ఆయన వివరించారు. మరికొందరు నిపుణులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
యాప్ కూడా కాపీ చేస్తారా..?
అంతేకాదు కింబో యాప్ అనేది ఒక కాపీ చేసి రూపొందించారని కూడా పలువురు వినియోగదారులు స్క్రీన్ షాట్లతో సహా ట్విట్టర్ వేదికగా ఎండగట్టారు. ఇది మరో స్వదేశీ మొబైల్ యాప్ ‘బోలో’ని చూసి కాపీ చేశారనేది అభియోగం. దీంతో గూగుల్ ప్లేస్టోర్, ఆపిల్ ఐఓఎస్ నుంచి కింబో యాప్ ను తొలగించాయి. పతంజలి కమ్యూనికేషన్స్ కూడా కింబో డౌన్ లోడ్ చేసే అవకాశాన్ని నిలిపివేశారు. అన్నింటా స్వదేశీ పెరుతో సత్తా చాటాలనుకుంటున్న బాబా రాందేవ్ కు ఈ రకంగా ఎదురుదెబ్బ తగిలిందన్న మాట.

