అలా కొట్టేశారేంటి ....?

చట్టాన్ని జనం చేతుల్లోకి తీసేసుకుంటున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మూక దాడులు చర్చనీయాంశంగా మారాయి. గో సంరక్షణ పేరుతో గోవులను తరలించే వారిపై విచక్షణారహితంగా సమూహాలు వెళ్ళి చితకొట్టడం ఇప్పటివరకు చూస్తూ వస్తున్నాం. అదే తరహాలో కొన్ని వందలమంది ఏకంగా పోలీస్ స్టేషన్ పైనే దాడి చేసి ఎస్సై కానిస్టేబుల్స్ ను చితకొట్టేశారు. ఖైదీ సినిమాలో చిరంజీవి పోలీసులందరిని బాదేసినట్లు ఒక్కసారిగా వందలమంది వచ్చి ఎటాక్ ఇవ్వడంతో దిక్కుతోచని ఎస్సై పోలీస్ స్టేషన్ లోని లాకప్ రూంలోకి వెళ్ళి రక్షించుకునే ప్రయత్నం చేసినా మూక క్షమించలేదు సరికదా బయటకు లాక్కొచ్చి కుమ్మేశారు. అడ్డు వచ్చిన కానిస్టేబుల్ కి దేహశుద్ధి చేసేసారు.
అసలేం జరిగిందంటే ...
నెల్లూరు జిల్లా రావూరు పిఎస్ పరిధిలోని పోలీస్ స్టేషన్ ఎస్సై లక్ష్మణ రావు డ్రంకన్ డ్రైవ్ కేసులో రమేష్ అనే యువకుడిని కొట్టారన్నది సంఘటనలో దాడికి దిగిన బృందం ఆరోపణ. విషయం బంధువులకు స్నేహితులకు తెలియడంతో వారంతా కట్టలు తెగిన ఆవేశంతో మూకుమ్ముడిగా పోలీస్ స్టేషన్ పై దండయాత్రకు వెళ్ళి ఎసై ని కానిస్టేబుల్ ను చితకొట్టేశారు. ఈ సంఘటనతో ఉలిక్కిపడిన పోలీస్ యంత్రాంగం అప్రత్తమైంది. దాడికి పాల్పడిన ప్రతిఒక్కరిపై చర్యలు తీసుకోవడానికి సమాయత్తమైంది. దీనిపై విచారణ జరిపి దోషులను గుర్తిస్తామని అధికారులు ప్రకటించారు.
సోషల్ మీడియా లో వైరల్ ...
ఎస్సైని, కానిస్టేబుల్స్ ను బాదేసిన ఈ సంఘటన సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. దాడి సమయంలో ఎవరో వీడియో తీసి పెట్టడంతో ఈ అంశం సంచలనంగా మారింది. సరిగ్గా ఇప్పుడు ఈ వీడియోనే పోలీసులకు మరోరకంగా ఆయుధం కాబోతుంది. దాడిలో పాల్గొన్న వారిని గుర్తించి ఆధారాలతో వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడానికి దోహదం చేయనుంది. మరోవైపు ఎస్సై వైఖరి కూడా వ్యవహారం ఇంతవరకు రావడానికి కారణం అని మరికొందరు అంటున్నారు. ఇదిలా ఉండగా దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్సై కానిస్టేబుల్స్ కి ప్రాణాపాయం లేదని వారు కోలుకుంటున్నట్లు పోలీస్ వర్గాల సమాచారం.
