అరుణ్ జైట్లీకి ఏమైంది?

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకు సర్జరీ అవసరమని వైద్యులు చెబుతున్నారు. అరుణ్ జైట్లీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని మంత్రి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. సోమవారం నుంచి అరుణ్ జైట్లీ విధులకు కూడా హాజరుకావడం లేదు. ఇంటినుంచే ఫైళ్లు క్లియర్ చేస్తున్నారని సన్నిహితులు చెబుతున్నారు. అంతేకాకుండా అరుణ్ జైట్లీ ఇటీవల ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయినా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఎన్నికైన 58 మంది రాజ్యసభ సభ్యుల్లో 53 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఐదుగురు మాత్రం చేయలేదు. అందులో జైట్లీ ఒకరు.
ఆ సర్జరీ వల్లనేనా?
జైట్లీ 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు. దీనివల్ల జైట్లీ ఆరోగ్యం దెబ్బతినింది. జైట్లీ షుగర్ వ్యాధితో బాధపడుతున్న సమయంలో బరువు తగ్గేందుకు ఈ సర్జరీ చేయించుకోవడం వల్ల సమస్యలు తలెత్తాయని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం జైట్లీని ఎయిమ్స్ వైద్యులు ఆయన ఇంట్లోనే పరీక్షలు చేస్తున్నారు. చికిత్స అందిస్తున్నారు. కిడ్నీ మార్పిడి అవసరమైతే జైట్లీ ఎయిమ్స్ లో అడ్మిట్ కావాల్సి ఉంటుందని వైద్యులు జైట్లీ కుటుంబ సభ్యులకు సూచించారు.
