Fri Dec 05 2025 19:53:42 GMT+0000 (Coordinated Universal Time)
నేను మా నాన్నంత మెతక కాదు.. ఎవ్వరినీ వదలను : నారా లోకేష్

ఏపీ టీడీపీ నేత నారా లోకేష్ అధికార పక్ష నేతలనుద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నా తల్లిని అవమానిస్తే చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు. ఇటీవల ఏపీలో వరదలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వరదల కారణంగా పలు జిల్లాల్లో మృతి చెందిన 48 మంది కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి భార్య నారా భువనేశ్వరి లక్షరూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ఈ నేపథ్యంలో భువనేశ్వరిపై పలువురు వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలపై నారా లోకేష్ తనదైన శైలిలో స్పందించారు.
మీరు మనుషులా ? పశువులా ?
బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన లోకేష్.. కష్టాల్లో ఉన్న వరద బాధితులను ఆదుకున్నా ఆరోపణలు చేస్తారా ? నా తల్లిని అవమానిస్తారా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను మా నాన్నంత మెతక కాదన్న లోకేష్.. తన తల్లిపై ఆరోపణలు చేసిన వారికి తగిన బుద్ధి చెప్తానని హెచ్చరించాడు. వరద బాధితులను ఆదుకునేందుకు మీరేమి సహాయం చేయకపోగా.. చేసేవారిపై ఆరోపణలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. వరదలతో ప్రజలు అల్లాడుతున్న సమయంలో విదేశాల్లో ఎంజాయ్ చేస్తూ..పేకాట ఆడుతున్న నేతలకు ఏం తెలుస్తుంది సహాయం విలువ అని దుయ్యబట్టారు. అధికార పార్టీ నేతలు అసలు మనుషులా ? పశువులా ? అర్థం కావట్లేదన్నారు.
ఎవ్వరినీ వదలను
నా తల్లి గురించి మాట్లాడిన వారు.. వాళ్ల తల్లుల గురించి కూడా ఇలాగే మాట్లాడుతారా ? అని మీడియా ముఖంగా ప్రశ్నించారు. మీ భార్య, బిడ్డల గురించి కూడా ఇంత నీఛంగా మాట్లాడుతారా ? అని మండిపడ్డారు. నా తల్లిని అవమానించినవాళ్లను నా తండ్రి వదిలేస్తారేమో.. నేను మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఆయనకున్నంత పెద్దమనసు నాకు లేదు..నా తల్లిపై ఆరోపణలు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలకు తగి బుద్ధి చెబుతాను' అని నారా లోకేశ్ హెచ్చరించారు.
Next Story

