సవాంగ్ కలత చెందారా?

ఆంధ్ర ప్రదేశ్ నూతన డీజీపీగా ఆర్పీ ఠాకూర్ నియమితులయ్యారు. తీవ్ర ఉత్కంఠ మధ్య గౌతమ్ సవాంగ్ ,ఆర్పీ ఠాకూర్ లలో ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంలో తీవ్ర చర్చ నడిచినా చివరి నిమిషంలో ఆర్పీ ఠాకూర్ ని పదవి వరించింది.ఏపీ కొత్త డీజీపీగా ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ ని నియమిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. 1986 బ్యాచ్ కి చెందిన సవాంగ్ కి డీజీపీ పదవి లభిస్తుందని చివరి వరకు భావించారు. నాటకీయ పరిణామాల మధ్య ఆర్పీ ఠాకూర్ కి పదవి లభించింది. కొద్ది నెలల క్రితం నండూరి సాంబశివ రావు పదవీకాలం ముగిసిన తర్వాత ఆ పదవిలోకి ఠాకూర్ వస్తారని ప్రచారం జరిగింది. నండూరికి మరో రెండేళ్లు పదవి కాలం పొడిగించాలని సీఎం భావించినా కేంద్ర హోమ్ శాఖ , యూపీఎస్సి లు రాష్ట్ర ప్రభుత్వ జాబితాను రెండు సార్లు తిప్పి పంపాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం డీజీపీని తామే సొంతంగా నియమించుకునేలా పోలీస్ రిఫార్మ్స్ యాక్ట్ ని సవరించాయి. ఠాకూర్ కోసమే కేంద్ర హోమ్ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు తిప్పి పంపింది అని ప్రభుత్వ వర్గాలు అనుమానించాయి. ఆ తర్వాత డీజీపీగా మాలకొండయ్య ని నియమించారు.
కేంద్ర వత్తిడుల మేరకేనా?
తాజాగా మాలకొండయ్య స్థానంలో సవాంగ్ నియామకం లాంఛనం అని భావించినా చివరి నిమిషంలో అది మారిపోయింది. ఠాకూర్ నియామకానికి ఢిల్లీ స్థాయిలో పెద్ద ఎత్తున ఒత్తిడి రావడం కారణంగా తెలుస్తోంది. దీంతో పాటు ఠాకూర్ నియామకానికి ముఖ్య మంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, ఇంటలిజెన్స్ చీఫ్ ఏబి.వెంకటేశ్వర రావులు మద్దతుగా నిలిచినట్లు తెలుస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా ఠాకూర్ వైపే మొగ్గు చూపారు. సవాంగ్ కి మరో ఆరేళ్ళ పదవీ కాలం ఉండటం, 2021 నాటికి ఠాకూర్ రిటైర్ అవుతుండటంతో ఆయనకు అవకాశం లభించినట్లు చెబుతున్నారు
.
సవాంగ్ కేంద్ర సర్వీసులకు వెళతారా?
మరో వైపు చివరి నిమిషంలో పదవి చేజారడంతో సవాంగ్ ఎలా వ్యవహరిస్తారు అనేది కీలకంగా మారింది. ఇప్పటికే మూడేళ్ళుగా విజయవాడ పోలీస్ కమిషనర్ గా ఉన్న సవాంగ్ కేంద్ర సర్వీస్ లకు వెళ్లిపోతారని ప్రచారం కూడా జరుగుతోంది. చాలా కాలం క్రితమే ఆయన విజయవాడ సీపీ బాధ్యతల నుంచి తప్పించాలని కోరినా కొంత కాలం పాటు వేచి ఉండాలని సీఎం సూచించారు. తాజాగా జరిగిన పరిణామాలతో సవాంగ్ మనస్తాపానికి గురయ్యారు. డీజీపీ పదవి ఖాయమని భావించిన తర్వాత జరిగిన పరిణామాలతో సవాంగ్ కలత చెందారు. తనకు వ్యతిరేకంగా ఉన్న వారితో కలిసి పని చేయకపోవచ్చని, త్వరలో కేంద్ర సర్వీసు లకు వెళ్లిపోతారని ప్రచారం జరుగుతోంది.
